హుజూర్‌నగర్‌లో రైతుబంధు స్కామ్.. తహసీల్దార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
ధరణి ఆపరేటర్ జగదదీశ్ తో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.

Rythu Bandhu Scam (Photo Credit : Google)
Rythu Bandhu Scam : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రైతుబంధు కుంభకోణం వెలుగుచూసింది. రైతుబంధు స్కామ్ లో నల్లొండ జిల్లా అనుముల తహసీల్దార్ జయశ్రీని పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుబంధు నిధుల్లో కుంభకోణానికి పాల్పడినట్లు జయశ్రీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో హుజూర్ నగర్ తహసీల్దార్ గా ఉన్నప్పుడు 14 లక్షల 63 వేల రూపాయలు కాజేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ధరణి ఆపరేటర్ జగదదీశ్ తో కలిసి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. దీంత ధరణి ఆపరేటర్ జగదీశ్ ని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
తహసీల్దార్ జయశ్రీని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్ కు తరలించారు. హుజూర్ నగర్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ధరణి ఆపరేటర్ కు చెందిన బంధువుల పేరు మీద రాయడానికి తహసీల్దారు జయశ్రీ సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.14.63 లక్షల రైతుబంధు నిధులను తహసీల్దార్ జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీశ్ కలిసి ఈ మొత్తాన్ని స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల నూతనంగా వచ్చిన కలెక్టర్ ప్రభుత్వ భూముల రికార్డులను పరిశీలిస్తున్న క్రమంలో హుజూర్ నగర్ లో ప్రభుత్వ భూమి ఒక్కసారిగా తగ్గిపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దీనిపై విచారణ జరపాలని హుజూర్ నగర్ ఆర్డీవోను కలెక్టర్ ఆదేశించారు.
గత నెల 20వ తేదీన విచారణ జరిపిన నేపథ్యంలో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 439, 604, 602, 608, 1041లో ఉన్న భూములన్నీ కూడా కంప్యూటర్ ఆపరేటర్ జగదీశ్ తన బంధువుల పేర్లతో ఎక్కించుకున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే అతడి జాబ్ నుంచి తీసేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపి తహసీల్దార్ జయశ్రీని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
Also Read : సీఎం చంద్రబాబుకి పెళ్లి కార్డు ఇచ్చి.. హైడ్రా నుంచి కాపాడాలని మల్లారెడ్డి కోరారా?