మావోయిస్ట్ గణపతి లొంగుబాటుకు పోలీసుల లైన్ క్లియర్

Line Clear to Maoist leader Ganapathi Surrender : మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగుబాటుకు పోలీసులు లైన్ క్లియర్ ఇచ్చారు. గణపతితో సహా ఎవరు లొంగిపోయినా స్వాగతిస్తామని పోలీసులు వెల్లడించారు. జంపన్న, సుధాకర్ కు సహకరించినట్టే గణపతికి కూడా సహకరిస్తామని స్పష్టం చేశారు.
కుటుంబ సభ్యులు లేదా బంధువులతో సంప్రదించవచ్చునని పోలీసులు తెలిపారు. వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యలపై సహాయం చేస్తామని పోలీసులు హమీ ఇచ్చారు. ఇప్పటివరకూ 1,137 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చారని తెలంగాణ పోలీసులు వెల్లడించారు.
మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావుకు లొంగుబాటుకు సిద్ధమయ్యాడని వార్తలు వచ్చాయి. 74 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న గణపతి లొంగుబాటుపై తన కుటుంబ సభ్యులతో మంతనాలు జరుపుతున్నారు. కరీంనగర్ జిల్లా సారంగపూర్ ప్రాంతానికి చెందిన లక్ష్మణరావు పీపుల్స్ వార్ గ్రూపుతో తన కెరీర్ ప్రారంభించారు.
నక్సలైట్ పార్టీల విలీనం తర్వాత మావోయిస్టు కేంద్ర కార్యదర్శిగా గణపతి పనిచేశారు. అనారోగ్య సమస్యలు తీవ్రతరం కావడంతో లొంగుబాటుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వానికి తాను లొంగి పోవాలని అనుకుంటున్నానని గణపతి తెలియజేశారు.. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు కూడా గణపతి లొంగుబాటుకు సంబంధించి రూట్ లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది.