గులాబీ గూటినుంచి కాంగ్రెస్ లోకి వలస వచ్చిన 10 మంది పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందట. వలసొచ్చిన కాంగ్రెస్ పార్టీలో మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నారు. అలాగని తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారన్న చర్చ తెలంగాణ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
మరోవైపు సుప్రీంకోర్టు ఏ క్షణంలో ఎలాంటి తీర్పునిస్తుందో అన్న టెన్షన్ 10 మందిని వెంటాడుతోందట. భవిష్యత్తు బావుంటుందన్న ఆశతో అధికార హస్తంపార్టీలో చేరితే..మొదటికే మోసం వస్తుందా అన్నమానాలు వారిని వెంటాడుతున్నాయట. బీఆర్ఎస్ పార్టీలో కారుగుర్తుపై గెలిచి..ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారట.
కాంగ్రెస్ లో చేరిన వెంటనే తాము కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటూ ఇక అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చని అంతా భావించారు. కానీ ఇక్కడే వ్యవహారం బెడిసికొట్టింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆ పది మంది ఎమ్మెల్యేలను అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దగా గుర్తించడంలేదట.
ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, పార్టీలోని ముఖ్య నేతలు, మంత్రులెవరూ తమను పెద్దగా పట్టించుకోవడంలేదని..పార్టీలోకి వస్తే ఇది చేస్తాం…అది చేస్తామంటూ ఇచ్చిన హామీలపై కనీసం మాటకూడా మాట్లాడడంలేదని 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ, ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్నారట. దీంతో తాము పార్టీ మారి తప్పు చేశామా అనే సందిగ్ధంలో పడ్డారట ఆ 10 మంది ఎమ్మెల్యేలు.
అయితే కొంత మంది ఎమ్మెల్యేలు తిరిగి గులాబీ గూటికి వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచన కూడా చేసినట్లు తెలుస్తోంది. గూడెం మహిపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, దానం నాగేందర్ వంటి వలస ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం కూడా చేశారన్న టాక్ రాజకీయవర్గాల్లో విన్పించినా..ఆ పది మంది ఎమ్మెల్యేలను ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి తీసుకోవద్దని గులాబీ బాస్ కేసీఆర్ స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నారట.
ఆ ఎమ్మెల్యేలకు నో ఛాన్స్
పార్టీలోకి వచ్చేందుకు ట్రై చేసిన ఆ ఎమ్మెల్యేలకు నో ఛాన్స్ అని వారి మొహం మీదే చెప్పేశారట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంతో ఏం చేయాలో పాలుపోక..బిక్కమోహంతో కాంగ్రెస్ పార్టీలో కొట్టుమిట్టాడుతున్నారట పార్టీ మారిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు. తమ రాజకీయ భవిష్యత్ ఏంటంటూ దిగాలుగా ఉన్నారని పార్టీవర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కేటీఆర్, పాడికౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడంతో..ఏ క్షణంలో కోర్టు ఎటువంటి తీర్పునిస్తుందో అని తెగ టెన్షన్ పడుతున్నారట వారంతా. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోడానికి ఎంత సమయం తీసుకుంటారని స్పీకర్ పై ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు..స్పీకర్ తో పాటు ఆ పదిమంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ కూడా జరిపింది.
దీంతో కోర్టు తీర్పుపై ఆ 10మంది ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే తమపై ఖచ్చితంగా వేటు పడడం ఖాయమంటూ కొంతమంది ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. ఒకవైపు కాంగ్రెస్ లో ఉండలేక, మరోవైపు తిరిగి గులాబీ గూటికి వెళ్లలేక ఆ పది మంది ఎమ్మెల్యేలు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి కారుగుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్లుగా ఉందట. వెళ్లే దారులన్నీ మూసుకుపోవడంతో…ఎలా ముందుకు వెళ్లాలో…ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారట. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే వీరి పరిస్థితిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీమారిన ఎమ్మెల్యేలపై ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పుతో అనర్హత వేటు పడితే మాత్రం ఉప ఎన్నికలు రావడం ఖాయం.
అయితే బై ఎలక్షన్లో గెలిస్తే సరి..ఒకవేళ ఓడిపోతే భవిష్యత్ ఏంటన్న ఆందోళన పార్టీ మారిన ఆ 10 ఎమ్మెల్యేలను వెంటాడుతోందట. ఎందుకంటే సుప్రీం తీర్పు నేపథ్యంలో బై ఎలక్షన్స్ వస్తే…ఆ 10 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను దించాలని ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు టాక్ విన్పిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే కాంగ్రెస్ లో అసంత్రుప్తితో కొట్టుమిట్టలాడుతున్న నేతలకు గాలం వేస్తున్నట్లు సమాచారం. ఐతే ఇవన్నీ లెక్కలు తేలాలంటే సుప్రీంకోర్టు తీర్పునిచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.