Nalgonda : ప్రతీకార హత్యలు.. ఉదయం తమ్ముడిని.. రాత్రి అన్నను

Nalgonda : ప్రతీకార హత్యలు.. ఉదయం తమ్ముడిని.. రాత్రి అన్నను

Nalgonda

Updated On : August 10, 2021 / 9:40 AM IST

Nalgonda :  నల్గొండ జిల్లాలో ప్రతీకార హత్య స్థానికంగా కలకలం రేపింది. నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో గల అక్కలాయిగూడెంలో ఆదివారం అన్నదమ్ములు హత్యకు గురయ్యారు. ఘటన వివరాల్లోకి వెళితే ఆవుల పాపయ్య, లక్ష్మమ్మ దంపతులకు సోములు, కాశయ్య (63), రామస్వామి (57) సైదులు కుమారులు.

తల్లిదండ్రులు గతంలోనే నలుగురు కుమారులకు 4.5 ఎకరాల చొప్పున పంచారు. వారు వేర్వేరుగా సాగు సాగు చేసుకుంటున్నారు. అయితే రెండవ కుమారుడు కాశయ్య, మూడవ కుమారుడు రామస్వామి మధ్య గత కొంత కాలంగా భూవివాదం నడుస్తుంది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినప్పడికి వారి వివాదం కొలిక్కిరాలేదు. ఇక ఈ క్రమంలో రామస్వామి బోరు మోటార్‌ వేసేందుకు ఆదివారం ఉదయం పొలం దగ్గరికి వెళ్లాడు.

అప్పటికే పొలం వద్ద ఉన్న కాశయ్య కుమారులు మల్లేశ్, మహేశ్‌లు రామస్వామితో గొడవకు దిగారు. గొడవ పెద్దది కావడంతో పక్కనే ఉన్న రాయితో రామస్వామి తలపై మోదారు.. దీంతో రామస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. రామస్వామి మృతితో రగిలిపోయిన అతడి బంధువులు.. అదును కోసం ఎదురుచూసి.. ఆదివారం రాత్రి మద్యం సేవించి గ్రామంలోకి వస్తున్న కాశయ్యపై దాడి చేశారు. కర్రలతో బలంగా కొట్టడంతో కాశయ్య అక్కడిక్కడే మృతి చెందాడు.

హత్య, ప్రతీకార హత్యలతో అక్కలాయిగూడెం వణికిపోయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. రామస్వామి కుమారుడు కిరణ్‌ అదుపులోకి తీసుకొని విచారించారు. కుటుంబాల మధ్య భూ వివాదం కొనసాగుతున్నా.. ఉద్యోగరీత్యా తాము దూరంగా ఉన్నామని కిరణ్‌ స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే అతడు చెప్పిన వివరాల మేరకు కొందరు సమీప బంధువులే ప్రతీకార హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.