Rains Farmers : అన్నదాతను ముంచిన అకాల వర్షం..రైతుల కళ్లముందే కొట్టుకుపోయిన ధాన్యం

రాత్రింబవళ్లు అని తేడా లేకుండా కష్ట పడి పండించిన పంటను మార్కెట్‌కు తరలించి అమ్ముకోవడమే మిగిలింది అనుకుంటుండగానే.. వరుణుడు రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించాడు.

Rains Farmers : అన్నదాతను ముంచిన అకాల వర్షం..రైతుల కళ్లముందే కొట్టుకుపోయిన ధాన్యం

Rain (2)

Updated On : May 4, 2022 / 7:16 PM IST

Premature rains : నాగలి వేసి నేలను చీల్చి.. పారే ఏరుని మలిపి, ఎరువులు జల్లి.. విత్తనమేసి, దానికి ప్రాణం పోసేవాడు రైతు. మొలకెత్తిన మొక్కను చూసి మదిలో మురిసే అన్నదాత.. ఆ నవ్వును చివరి దాకా ఉంచుకోలేక అల్లాడిపోతున్నాడు. నారుపోసి.. నాట్లేసి.. కలుపులు తీసే రైతుకు.. పంట చేతికొచ్చినా.. చివరికి పైసాగా మారటం లేదు. ఆరుగాలం శ్రమించి కష్టనష్టాలకోర్చి ధాన్యం పండించినా.. దాన్ని అమ్ముకోలేకపోతున్నాడు.

రాత్రింబవళ్లు అని తేడా లేకుండా కష్ట పడి పండించిన పంటను మార్కెట్‌కు తరలించి అమ్ముకోవడమే మిగిలింది అనుకుంటుండగానే.. వరుణుడు రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. పడాల్సిన సమయంలో మొహం చాటేసిన వాన.. కల్లాల్లో ధాన్యం ఉన్న సమయంలో కురిసి.. రైతును నట్టేట ముంచేసింది. అప్పులు చేసి మరీ వ్యవసాయం చేస్తే.. ప్రకృతి పగబట్టి మరీ దాడి చేసింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పంటంతా నీటి పాలైంది. వేలాది కుటుంబాల ఆశలన్నీ ముంచేసింది.

Telangana: తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు వర్షాలు

వాస్తవంగా.. ఈ సీజన్‌‌లో పంటల విషయంలో డైలమా నెలకొంది. కేంద్రం కొనబోమంటోంది కాబట్టి వరి ధాన్యం పండించొద్దని ప్రభుత్వం సూచించింది. వరికి బదులుగా ఏం వేయాలో మాత్రం చెప్పలేదు. దీంతో.. ఏం పంటలు వేయాలో దిక్కు తోచని స్థితిలో.. కొందరు రైతులు ప్రత్యామ్నాయాలవైపు మళ్లారు. మరికొందరు రైతులు ఏం జరిగితే అదే జరిగిందని తెగించి మరీ వరి వేశారు. ఇలాంటి సమయంలో.. పంట కొనేది లేదని ప్రభుత్వం చెప్పడంతో.. రైతుల్లో ఆందోళన పెరిగిపోయింది. అయితే.. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ.. ఆందోళన నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ తర్వాత పూర్తి పంటను తామే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది.

చివరి గింజ వరకూ తామే కొంటామని సర్కార్‌నుంచి హామీ రావడంతో.. రైతుల మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి. చేసిన అప్పులు తీరుతాయనే సంబరం కనిపించింది. కాపుకొచ్చిన పంటను చూసి మురిసిపోయారు. చేతికొచ్చిన పంట లాభాలు పండిస్తుందని కలలు కన్నారు. కానీ.. చివరకు వర్షం రూపంలో వారి ఆనందం ఆవిరై పోయింది. అన్నదాత ఏడాది కష్టాన్ని, కలలను, ఆశలను బూడిదలో పోసింది ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం.

Weather alert: తెలంగాణలో అకాల వర్షం.. అన్నదాత విలవిల..

కళ్లముందే వరదలో ధాన్యం కొట్టుకుపోతుంటే.. రైతుకు నోట మాట రాలేదు. ఏమనాలో, ఎవరిని నిందించాలో తెలియక.. కంట తడి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రాత్రి దాకా ధాన్యంతో నిండిపోయిన కల్లాలు..చెరువులుగా మారడాన్ని చూసి రైతుల గుండె పగిలింది. వరద వెంట కొట్టుకుపోతున్న ధాన్యం చూసి…రైతు కంట కన్నీరాగడం లేదు. కల్లాల్లోనే కాదు..కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కూడా తడిసి ముద్దయయింది.