Professor Nageshwar : అల్లు అర్జున్ ఏమీ తీవ్రవాది కాదు..! అరెస్ట్ వ్యవహారంపై ప్రొ.నాగేశ్వర్ కీలక వ్యాఖ్యలు
బెడ్ రూమ్ లోకి వెళ్లి మరీ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం ఏర్పడిందో పోలీసులు వివరణ ఇవ్వాలి.

Professor Nageshwar On Allu Arjun Arrest (Photo Credit : Google)
Professor Nageshwar : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. సినీ, రాజకీయ ప్రముఖులు దీనిపై స్పందించారు. తమ వెర్షన్ వినిపించారు. ఇక, అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ.నాగేశ్వర్ స్పందించారు. అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన తీరు, పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసులు, సంధ్య థియేటర్ లో తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులు తదితర అంశాలపై ప్రొ.నాగేశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అల్లు అర్జున్ అరెస్ట్ అంశంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు అలానే మాట్లాడతారని ఆయన చెప్పారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుందన్నారు. ప్రతిపక్షాలు వ్యతిరేకించాయన్నారు.
”తనకు డ్రెస్ మార్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదని అల్లు అర్జున్ చెప్పినట్లుగా విన్నాను. ఆ విధంగా వ్యవహరించాల్సిన అవసరమైతే పోలీసులకు లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఏమీ తీవ్రవాది కాదు. చట్టం నుంచి తప్పించుకుని పారిపోయే వాడూ కాదు. అరెస్ట్ చేసేటప్పుడు ఏ పౌరుడికైనా ఆ అవకాశం ఇవ్వాలి. ఆయనేమీ తప్పించుకోడు కదా. డ్రెస్ మార్చుకుని వచ్చేసరికి ఏమవుతుంది? 10 నిమిషాలు సమయం ఇవ్వొచ్చు. బెడ్ రూమ్ లోకి వెళ్లి మరీ అరెస్ట్ చేయాల్సిన అవసరమైతే లేదు. దీనిపై హైదరాబాద్ పోలీస్ వివరణ ఇవ్వాలి. బెడ్ రూమ్ లోకి వెళ్లి మరీ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం ఏర్పడిందో పోలీసులు వివరణ ఇవ్వాలి.
అల్లు అర్జున్ పై పెట్టిన కేసులు విషయానికి వస్తే.. కల్పబుల్ హోమిసైడ్ కేసులు పెట్టారు. కల్పబుల్ హోమిసైడ్ అంటే చాలా పెద్ద క్రైమ్. అంటే.. ఒక రకంగా హత్య కాదు. కానీ, మర్డర్ కు దారితీసే దోషపూరిత నేరం ఇది. అల్లు అర్జున్ తప్పు ఉంటే నిర్లక్ష్యం అనేది ఉంటుంది. కానీ, కావాలని తెలిసి తొక్కిసలాట ఘటన జరగడానికి అల్లు అర్జున్ అయితే దోహదం చేయడు. ఇక, అల్లు అర్జున్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ లో ..నేను పోలీసులకు సమాచారం ఇచ్చాను. సంధ్య ధియేటర్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాను అని అన్నాడు. నిజంగానే మరి సంధ్య థియేటర్ యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం చేసి వెళ్లి ఉంటే.. అల్లు అర్జున్ పై నేరారోపణ చేయలేము.
కానీ, పోలీసుల వర్షన్ ఏంటంటే.. సంధ్య థియేటర్ గేటు దగ్గర నిలబడి అల్లు అర్జున్ 10 నిమిషాలు మాట్లాడాడు. దానికి పోలీసుల అనుమతి ఉందా? అని పోలీసు ఉన్నతాధికారులు అడిగారు. న్యాయంగా అయితే.. సంధ్య థియేటర్ దగ్గర చాలా నేరో స్పేస్ ఉంటుంది. అక్కడికి వెళ్లకపోవడమే కరెక్ట్. కానీ, అదేం సెంటిమెంటో అర్థం కాదు. యాక్టర్ల అంతా అక్కడికే పోతారు. ఈ ఘటనలో డైరెక్ట్ గా కల్పబుల్ హోమోసైడ్ అనే స్థాయిలో అల్లు అర్జున్ పై ఆరోపణలు చేయడం, అది ఎంతమేరకు కోర్టులో నిలబడుతుంది అనేది కూడా అనుమానమే” అని ప్రొ.నాగేశ్వర్ విశ్లేషించారు.