Protocol Conflict
Minister Jagadish Reddy : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాటీలో ఈరోజు నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి జగదీష్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య వివాదస్పద వాతావరణం ఏర్పడింది. కార్డుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రోటోకాల్ పాటించలేదంటూ.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సభలో మాట్లాడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేకు కనీస సమాచారం లేకుండా ఇవ్వకుండా నియోజకవర్గంలో కార్యక్రమం ఎలా నిర్వహిస్తారంటూ మంత్రి జగదీష్ రెడ్డిని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. జగదీశ్ రెడ్డి ముందే రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టడం కాదని, సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరారు. ఇంతలో కలగజేసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి.. కోమటిరెడ్డిని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిల్లర మాటలు మాట్లాడొద్దంటూ మైకును గుంజుకునే ప్రయత్నం చేశారు. అటు కోమటిరెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటరిస్తూ మంత్రిపై దూషణలకు దిగారు. అంతేకాదు మంత్రి చేతిలోని మైకును లాక్కొవడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నించారు.
దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సభ వేదికపైనే కొట్టుకునేంత వరకు వెళ్లారు. ఒకరికొకరు తీవ్ర స్థాయిలో వాగ్వాదం చేసుకున్న నేతలు.. మైకులు లాగేసుకున్నారు. కొట్టుకునే వరకు వెళ్లారు. పోలీసులు, రెండు పార్టీలకు చెందిన నేతలు జోక్యం చేసుకోని ఇద్దరిని వేరు చేయడంతో పక్కక జరిగారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి మంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు…అధికారాన్ని అడ్డంపెట్టుకుని అహంకారానికి పోవద్దు…ఈటెలను ఒడగొట్టేందుకే దళిత బంధు తీసుకొచ్చారు…మునుగోడు నియోజకవర్గాల్లో దళితులు లేరా ?…సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కో న్యాయం,నల్గొండకో న్యాయమా ?….మంత్రిగా కొనసాగే నైతిక అర్హత జగదీష్‌రెడ్డికి లేదు….నా నియోజకవర్గానికి వచ్చి నీ ప్రతాపమేంది ?….పోలీసులను పెట్టుకోని మమ్మల్ని బయటకు వెళ్లగొట్టడం ఏంటి ?…..సూర్యాపేటకు రావాలన్నా… పోవాలన్నా చౌటుప్పల్ నుంచే పోవాలి గుర్తుపెట్టుకో….నీ ప్రతాపం సూర్యాపేటలో చూపించుకో. ….అభివృద్ధికి సహకరిస్తేనే మునుగోడులోకి అడుగుపెట్టనిస్తా, లేదంటే మునుగోడుకి ఎంటర్ కానివ్వం అంటూ కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డిపై విరుచుకు పడ్డారు.