Rain Alert: తెలంగాణలో వానలేవానలు.. ఆ 11 జిల్లాల్లో రెండ్రోజులు భారీ వర్షాలు.. వేగంగా కదులుతున్న రుతుపవనాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Heavy rains
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం కొన్నిచోట్ల, బుధవారం అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది.
మంగళవారం కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, కొన్నిచోట్ల భారీ వర్షాలుసైతం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
బుధవారం నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు జిల్లాలతోపాటు మొత్తం 11 జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. వర్షాల కారణంగా ఎండ తీవ్రత తగ్గనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉంది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. రెండుమూడు రోజుల్లో దక్షిణ అరేబియా, మాల్దీవులు, కొమోరిన్ సహా బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలను విస్తరించనున్నారు. దీంతో అంచనా వేసిన సమయానికంటే ముందుగానే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు పూర్తిగా విస్తరించి ఉన్నాయి. జూన్ మొదటి వారంలోనే తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.