హైదరాబాద్ : శ్రీలంక సమీపంలోని కోమరిన్ ప్రాంతం నుంచి తమిళనాడు మీదుగా తెలంగాణ వరకు 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. తెలంగాణాలో అదే ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉండటంతో వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. సోమ(ఫిబ్రవరి 18), మంగళవారాల్లో(ఫిబ్రవరి 19) పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు.
ఆంధ్ర, రాయలసీమల్లో చూస్తే పలుచోట్ల ఎండలు ఒక్కసారిగా పెరిగాయి. రాయలసీమలో ఆదివారం(ఫిబ్రవరి 17) పలుచోట్ల ఎండ తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. తిరుపతిలో 37 డిగ్రీలు నమోదైంది. కోస్తాలో అనేకచోట్ల మంచు కురిసింది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఆదివారం(ఫిబ్రవరి 17) సాయంత్రం నుంచి పడమర గాలులు వీస్తుండంతో ఉత్తర కోస్తాలో రాత్రి చలి వాతావరణం నెలకొంది. 24 గంటల్లో రాష్ట్రంలో కోస్తా, రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.