ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు.. తెలంగాణలోని కౌలు రైతులకు శుభవార్త..

కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1 నుంచి ప్రాధాన్య రంగాల రుణాల (పీఎస్ఎల్) మంజూరులో అనుసరించాల్సిన నిబంధనలపై అన్ని బ్యాంకులకు ఆర్బీఐ..

ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు.. తెలంగాణలోని కౌలు రైతులకు శుభవార్త..

Updated On : March 30, 2025 / 12:39 PM IST

RBI New Guidelines: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కౌలు రైతులకు శుభవార్త చెప్పింది. భూమిని కౌలుకు తీసుకొని పంటలు సాగుచేసే రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపవు. ప్రభుత్వం నుంచి ఆశించిన లబ్ధి చేకూరడం లేదు. దీంతో పంట సాగు సమయంలో పెట్టుబడి కోసం కౌలు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు. ఒక్కోసారి పంటలు చేతికిరాక, అప్పులు కట్టలేక అనేక మంది కౌలు రైతులు ఆత్మహత్యలుసైతం చేసుకున్నారు. అలాంటి కౌలు రైతులకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది.

 

కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1 నుంచి ప్రాధాన్య రంగాల రుణాల (పీఎస్ఎల్) మంజూరులో అనుసరించాల్సిన నిబంధనలపై అన్ని బ్యాంకులకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల్లో సన్న, చిన్నకారు రైతులకిచ్చినట్లే కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలని సూచించింది.

 

ఆర్బీఐ మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి.. 13 రకాలవారిని బలహీన వర్గాలుగా గుర్తించి రుణాలివ్వాలి. వీరిలో సన్న, చిన్నకారు రైతులు, వృత్తి కార్మికులు, ఎస్సీలు, ఎస్టీలు, స్వయం సహాయక సంఘాలు, ఒంటరి మహిళలు, వడ్డీ వ్యాపారులిచ్చిన అప్పుల వలలో చిక్కుకున్న వారు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, మైనార్టీలు తదితరులు ఉన్నారు. అంతేకాక.. గ్రామీణ కుటీర పరిశ్రమలకు రూ.2లక్షలలోపు రుణాలివ్వాల్సి ఉంది.

 

ఎలాంటి భూమిలేని వ్యక్తి అయినా వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనులు చేస్తుంటే రూ.2.50లక్షల రుణం. సన్న, చిన్నకారు రైతులకు పంట రుణాలను పీఎస్ఎల్ కేటగిరిలో ఇవ్వాలని ఆర్బీఐ సూచించింది. వ్యవసాయ కార్మికులకు, రాతపూర్వక ఒప్పందం లేకుండా నోటిమాటగా యాజమాని నుంచి పొలం కౌలుకు తీసుకొని సాగుచేసే రైతులకూ, పంటను పంచుకునే ఒప్పందంతో సాగు చేసేవారికి కూడా సన్న, చిన్నకారు రైతులకు ఇచ్చినమాదిరిగా పంట రుణం ఇవ్వాలని ఆర్బీఐ నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది. తద్వారా కౌలు రైతులకు రూ.2.50 లక్షల రుణం పొందేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది.

 

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అధిక జీఎస్డీపీ ఉన్న జిల్లాలకు పీఎస్ఎల్ రుణాలు పంపిణీలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్బీఐ పేర్కొంది. అయితే, దేశవ్యాప్తంగా 196జిల్లాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రంలో హనుమకొండ, జనగామ, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాలు ఉన్నాయి.