రోడ్లపై పడిన వర్షపునీరు చెరువుల్లోకి, నదుల్లోకి చేరాలా.. అలాగే రోడ్లపై ఉండాలా?: రేవంత్ రెడ్డి
వరదలు వచ్చి, ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ప్రజలు ప్రభుత్వాన్ని తిట్టడం లేదా అని ప్రశ్నించారు.

CM Revanth Reddy
రోడ్లపై పడిన వర్షపునీరు చెరువుల్లోకి, నదుల్లోకి చేరాలా.. అలాగే రోడ్లపై ఉండాలా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లోని సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. చెన్నై, బెంగళూరులో వరదలు చూశామని, అలాంటి పరిస్థితి మనకూ రావాలా అని నిలదీశారు.
వరదలు వచ్చి, ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ప్రజలు ప్రభుత్వాన్ని తిట్టడం లేదా అని ప్రశ్నించారు. మూసీ విషం హైదరాబాద్లోనే కాదని, నల్లగొండలోనూ పారుతోందని చెప్పారు. వరదలు వచ్చి నగరం మునిగిపోతే అప్పటికప్పుడు ఏమైనా చేయగలుగుతామా అని ప్రశ్నించారు.
మూసీ పునరుజ్జీవనానికి కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ కాదు… మూసీ పునరుజ్జీవనమే చేస్తున్నామని అన్నారు. మూసీ పునరుజ్జీవనంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు.
మూసీ పరివాహక ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలని తాము భావిస్తున్నామని తెలిపారు. గత సర్కారు హయాంలో మల్లన్న సాగర్, వేమలఘాట్‌లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. అప్పట్లో పోలీసులతో కొట్టించినట్లు ఇప్పుడు తాము అలా ఖాళీ చేయించటం లేదని తెలిపారు.
మూసీ పునరుజ్జీవంపై సబ్ కమిటీ వేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. లబ్ధిదారులే మూసీ నుంచి వెళ్లిపోయారని, మూసీలో ఇటుక కూడా ప్రభుత్వం కూల్చలేదని అన్నారు. హైడ్రా అక్కడికి వెళ్లనే లేదని, నిర్వాసితులకు తాము మేలు చేస్తామని తెలిపారు. దామగుండం పై అన్ని అనుమతులు ఇచ్చింది గత ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు.
30 ఏళ్లుగా మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాలే.. రాజకీయాలు ఎలా మలుపులు తిరిగాయో తెలుసా?