Revanth Reddy Team : ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, 10మంది ఉపాధ్యక్షులు.. రేవంత్ టీమ్ ఇదే

Revanth Reddy Team : ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, 10మంది ఉపాధ్యక్షులు.. రేవంత్ టీమ్ ఇదే

Revanth Reddy Team

Updated On : June 27, 2021 / 1:02 PM IST

Revanth Reddy Team : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపిక పూర్తయింది. రేవంత్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చిన ఏఐసీసీ.. ఐదుగురికి వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా, పది మందిని సీనియర్‌ ఉపాధ్యక్షులుగా నియమించింది. మరో మూడు కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. మొత్తం కార్యవర్గం, కమిటీల కూర్పులో సామాజిక కోణాన్ని బట్టి ఎంపిక చేసింది. గతంలో పీసీసీకి నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు ఉండగా.. ఇప్పుడా సంఖ్యను ఐదుకు పెంచింది. గతంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా ఉన్న వారిలో రేవంత్‌ను అధ్యక్షుడిగా నియమించగా.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్‌లను తప్పించింది.

అజారుద్దీన్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగిస్తూ.. కొత్తగా సీనియర్‌ నేతలు గీతారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు అవకాశమిచ్చింది. ఆ విధంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు పదవులు ఇచ్చింది ఏఐసీసీ.

10 మంది సీనియర్‌ ఉపాధ్యక్షుల నియామకంలోనూ సామాజిక కూర్పు పాటించింది. ఎస్సీలు ముగ్గురు, ముగ్గురు ఓసీలు, ఒక ఎస్టీ, ఇద్దరు బీసీలు, ఒక మైనార్టీ నాయకుడికి అవకాశమిచ్చింది. ఇక ప్రచార కమిటీ చైర్మన్‌గా బీసీ నేత మధుయాష్కీగౌడ్‌కు, కన్వీనర్‌గా మైనార్టీ నాయకురాలు సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనీకి స్థానం కల్పించింది.

ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలను ఎస్సీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహకు ఇవ్వగా, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ బాధ్యతలను ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి అప్పగించింది.