Telangana : వామ్మో ఎండలు.. ఇది శాంపిల్, మున్ముందు పెరుగనున్న ఉష్ణోగ్రతలు

ఇది శాంపిల్ మాత్రమేనని.. ముందు ముందు ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. నిన్న మొన్నటిదాకా వీచిన చలిగాలులు చల్లబడ్డాయి...

Telangana : వామ్మో ఎండలు.. ఇది శాంపిల్, మున్ముందు పెరుగనున్న ఉష్ణోగ్రతలు

Ap And Telangana

Updated On : March 16, 2022 / 7:30 AM IST

Rising Temperatures : మార్చి రెండోవారం నుంచే.. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రోజూ 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. మధ్యాహ్నం అయిందంటే చాలు.. రోడ్లపై జనసంచారం తగ్గిపోతోంది. అయితే.. ఇది శాంపిల్ మాత్రమేనని.. ముందు ముందు ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. నిన్న మొన్నటిదాకా వీచిన చలిగాలులు చల్లబడ్డాయి. వేసవి కాలం వచ్చేసినట్టుగా ఉక్కపోత మొదలైంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి మార్చి రెండో వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో 35 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర భారతలో వీస్తున్న వేడి గాలుల కారణంగా మార్చి రెండో వారంలోనే పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వచ్చే నెల, మే నెలల్లో వేడి గాలులతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రికార్డ్‌ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు పెరుగుతున్నాయి.

Read More : Hyderabad Real Estate : త్వరలో మరోసారి హైదరాబాద్ లో రియల్ బూమ్ ?

ఎండల ప్రభావంతో అడుగు బయటపెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చిలోనే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకెంత దారుణ పరిస్థితులు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలోఇటీవల ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తగ్గింది. దీంతో వేడి పెరిగింది. మధ్యాహ్నం ఉక్కపోత ఉంటోంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాయువ్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ శ్రావణి చెప్తున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వాతావరేణం పొడిగా మారింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు.. కర్నూలు జిల్లాలోనూ సూర్యుడు సుర్రుమంటున్నాడు. నంద్యాలలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ ఎండ వేడి ఎక్కువగా ఉంది. క్రమేపీ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు.