Hyderabad Real Estate : త్వరలో మరోసారి హైదరాబాద్ లో రియల్ బూమ్..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 111 జీవో రద్దు చేస్తామని ప్రకటించింది. ఎక్స్‌పర్ట్‌ కమిటీ నివేదిక రాగానే జీవోను క్యాన్సిల్‌ చేస్తామని చెప్పింది.

Hyderabad Real Estate : త్వరలో మరోసారి హైదరాబాద్ లో రియల్ బూమ్..!

Hyderabad Real Estate

Updated On : March 16, 2022 / 7:28 AM IST

Hyderabad Real Estate :  తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 111 జీవో రద్దు చేస్తామని ప్రకటించింది. ఎక్స్‌పర్ట్‌ కమిటీ నివేదిక రాగానే జీవోను క్యాన్సిల్‌ చేస్తామని చెప్పింది. 111 జీవో రద్దుతో ఇంతకాల అభివృద్ధికి నోచుకోని నగర శివార్లలోని గ్రామాల రూపురేఖలు మారిపోనున్నాయి. లక్షల ఎకరాల విలువ ఒక్కసారిగా పెరిగి నగర  దశ దిశ మారనుంది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ పెరిగిపోయి ఇప్పుడున్న  వాటి విలువకు రెక్కలు రానున్నాయి.

త్వరలోనే జీవో 111 రద్దు చేస్తామని సీఎం అసెంబ్లీలో చేసిన కామెంట్లతో ఈ జీవోపై మరోసారి చర్చ మొదలైంది. పాతికేళ్లుగా హైద‌రాబాద్ వాయు వేగంతో విస్తరించడంతో నగరంలో జీవో 111 పరిధి వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు దాన్ని ఎత్తేస్తే హైదరాబాద్‌ రూపురేఖలే మారిపోతాయి. నగరం శరవేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో నిర్మాణాలున్నప్పటికీ దానికి చాలా పరిమితులున్నాయి. ఇప్పుడు జీవోను ఎత్తేస్తే మొత్తం మారిపోతుంది. అక్కడ రియల్‌ బూమ్‌ను పట్టుకోవడం సాధ్యం కాదు. జీవో ఎత్తేసిన మరుక్షణం ఇక్కడ భూముల ధరలు రెట్టింపైనా ఆశ్చర్యం లేదు. ఎంతో కాలంగా దీన్ని ఎత్తివేయాలన్న డిమాండ్ ఉంది. ఇప్పుడు సీఎం ప్రకటనతో త్వరలోనే దానికి మోక్షం కలగనుంది.

ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే 111 జీవో పరిధిలోని ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. అది మరో మినీ హైదరాబాద్‌గా మారిపోనుంది. ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లతో ఆ ప్రాంతం హైఫై సిటీగా మారిపోనుంది. ఇంతకాలం దీనికి 111జీవో అడ్డుగా మారింది. త్వరలో ఈ అడ్డు తొలగిపోతే అంతా మారిపోతుంది.

ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్‌ల జంట జ‌లాశ‌యాలు నిర్మాణాలతో క‌లుషితం కాకూడదనే ల‌క్ష్యంతో 1996లో అప్పటి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ జీవో 111 తో ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్‌ల ప‌రివాహ‌క ప్రాంతంలో ప‌రిశ్రమలు ఏర్పాటు చేయడం, భారీ నిర్మాణాలు చేపట్టడం నిషేధించారు. ట్రిపుల్ వన్ జీవో ప‌రిధిలోని నిర్మాణాలపై ఆంక్షలు కొన‌సాగ‌తుండ‌టంతో.. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమయింది. జీవో 111 ర‌ద్దు చేయాల‌న్న స్థానికుల డిమాండ్‌కు రాజ‌కీయ పార్టీలు సైతం జైకొట్టాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులకు, బడా పారిశ్రామికవేత్తలకు ఇక్కడ ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. కొందరికి వందల ఎకరాలున్నాయి.

టిఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. సీఎస్ అధ్యక్ష్యతన 2016 లో హైప‌వ‌ర్ క‌మిటీ వేసింది. సీఎం కేసీఆర్ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా.. 111 జీవోను ఎత్తివేసేందుకు ఈ క‌మిటీని నియ‌మించారని భావిస్తున్నారు. జంట జ‌లాశ‌యాలు రాజ‌ధానికి తాగునీరు అందించేవి కావ‌డంతో.. జీవో 111ను ప‌టిష్టంగా అమ‌లు చేయాలని సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశించాయి. అయితే.. ఇప్పుడు రాజ‌ధానికి కృష్ణా, గోదావ‌రి నుంచి తాగునీరు వ‌స్తుండ‌టంతో.. వాటికోసం.. న‌గ‌రం న‌లుదిక్కులా నాలుగు జ‌లాశ‌యాల‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది.

దీనివల్ల జంట జ‌లాశ‌యాల తాగునీరు క‌లుషితం కానుందన్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు న్యాయ‌స్థానాల్లో కూడా.. ట్రిపుల్ వన్‌కు ఉన్న అడ్డంకుల‌ను తొల‌గించ‌వ‌చ్చని సీఎం కేసీఆర్ వాదన. జీవో111 ను ఎత్తివేసేందుకు గ్రౌండ్ రిపోర్ట్‌గా హైప‌వ‌ర్ క‌మిటీ రిపోర్టును ఉప‌యోగించు కోనుంది ప్రభుత్వం.

ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. జీవో 111 రద్దు చేస్తామని వైఎస్‌ హయాంలోనే హామీ ఇచ్చారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అందుకే ఈ నిర్ణయాన్ని తాము తప్పకుండా స్వాగతిస్తామన్నారు. అయితే తనకు మాత్రం అక్కడ ఎలాంటి భూములు లేవన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.

అయితే 111 జీవో రద్దు అనేది అనుకున్నంత సులువు కాదంటున్నారు హైకోర్టు సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య. ఈ జీవోను రద్దు చేస్తే న్యాయపరమైన  చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ జీవోపై చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

ఈ జీవో పరిధిలోని 84గ్రామాల విస్తీర్ణంలో లక్షా 32వేల ఎకరాల 538 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ మండలాల పరిధిలో గత 10-15 ఏళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం సహా ఐటీ కంపెనీల ఏర్పాటుతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. దీంతో ఇక్కడి భూములు ధరలు గజం రూ. 40-60 వేలకు చేరాయి. ఇప్పుడు 111జీవోను ఎత్తేస్తే ఇక ఆ ప్రాంతంలో భూములకు రెక్కలు వస్తాయి. రేట్లను పట్టుకునే అవకాశమే లేదు.