Road Accident: కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఏడుగురు నాచారం వాసులు మృతి

యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొని తమ స్వస్థలాలకు తిరిగివస్తున్న తెలుగు యాత్రికుల మినీ బస్సు ప్రమాదానికి గురైంది.

Road accident

Road Accident: యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొని తమ స్వస్థలాలకు తిరిగివస్తున్న తెలంగాణ యాత్రికుల మినీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ సిహోరా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. యాత్రికులతో వస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన వాహనం నంబరు ఏపీ29డబ్ల్యూ1525గా గుర్తించారు. రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం మృతులు ఏపీ ప్రాంతానికి చెందిన వారిగా అధికారులు తొలుత భావించారు. అయితే, మృతదేహాల వద్ద దొరికిన ఆధారాల ప్రకారం వారంతా హైదరాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గం నాచారం వాసులుగా గుర్తించారు.

Also Read: Bird Flu: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ హడల్.. చికెన్, గుడ్లు తింటున్నారా.. అయితే, తప్పనిసరిగా ఇలా చేయండి

సిహోరా సమీపంలోకి మినీ బస్సు రాగానే.. సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ హైవేపైకి రాంగ్ రూట్ లో రావడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లారీ ఢీకొట్టడంతో మినీ బస్సులోని ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం సమయంలో బస్సులో 14 మంది ప్రయాణిస్తున్నారు. మిగిలిన యాత్రికులు బస్సులో ఇరుక్కుపోవడంతో స్థానికులు వారిని బయటకుతీసి చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, వారిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నాచారం నుంచి కుంభమేళాకు మూడు మినీ బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఒక మినీ బస్సు ప్రమాదానికి గురైంది.

Also Read: RSS : చిలుకూరు బాలాజీ పూజారిపై దాడి.. ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన.. మరోసారి ఇలాంటివి..

కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి..
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులంతా ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారానికి చెందిన వారుగా గుర్తించారు. అయితే, బండి సంజయ్ బజల్ పుర్ ఎస్పీ, కలెక్టర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం తొమ్మిది మంది ప్రమాదానికి గురికాగా.. ఏడుగురు మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు కోమాలోకి వెళ్లగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని కేంద్ర మంత్రికి అధికారులు వివరించారు. కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. అయితే, క్షతగాత్రులకు అన్ని రకాలుగా సాయం అందేలా చూడాలని బండి సంజయ్ అక్కడి అధికారులను కోరారు. మృతులకు వెంటనే పంచనామా పూర్తిచేసి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు పంపేలా ఏర్పాట్లు చేయాలని సంజయ్ కోరారు.

చనిపోయిన వారిలో నవీన్, ఆనంద్, రవి, శశికాంత్, మల్లారెడ్డి, సంతోష్ ఉన్నారు. బాలక్రిష్ణ తోపాటు మరికొంత మంది చికిత్స పొందుతున్నారు.