Bird Flu: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ హడల్.. చికెన్, గుడ్లు తింటున్నారా.. అయితే, తప్పనిసరిగా ఇలా చేయండి
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను బర్డ్ ప్లూ వైరస్ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని గోదావరి జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

Bird flu
Bird Flu: తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను బర్డ్ ప్లూ వైరస్ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని గోదావరి జిల్లాల్లో కొన్నిరోజులుగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోవడంతో కలకలం రేగింది. మరోవైపు తెలంగాణలోని ఏపీ సరిహద్దు ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ ప్లూయెంజా (హెచ్5ఎన్1 – బర్డ్ ప్లూ) వైరస్ కారణమని తేలిసింది. వివిధ ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డీసీజెస్ కు పంపారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లాలోని వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లాలోని కానూరు అగ్రహారంలోని ఫారాల నుంచి పంపిన రెండు నమూనాలు పాజిటివ్ గా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు బర్డ్ ప్లూ నిర్దారణ అయిన రెండు కోళ్ల ఫారాల్లో కోళ్లను పూడ్చిపెట్టడంతోపాటు.. కిలో మీటరు వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
Also Read: హై అలర్ట్.. బర్డ్ ఫ్లూగా నిర్ధారణ.. చికెన్ తినడం తగ్గించాలి.. ఆ షాపులు మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు
బర్డ్ ప్లూ వ్యాప్తి నేపథ్యంలో కోళ్ల వ్యాధులపై రైతులకు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బర్డ్ ప్లూగా గుర్తించిన రెండు ఫారాల్లోని కోళ్లు, గుడ్లను పూడ్చిపెట్టాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. అయితే, పూడ్చిపెట్టే ఒక్కో కోడికి రూ.90 చొప్పున పరిహారం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఏపీలో బర్డ్ ప్లూ కేసులు వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వంసైతం అప్రత్తమైంది. రాష్ట్రంలోకి ఈ వైరస్ వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కోళ్ల పెంపకందారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమై బర్డ్ ప్లూ వ్యాప్తి, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు బర్డ్ ప్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి కోళ్లు, గుడ్లు, పౌల్ట్రీ ఫీడ్ (కోళ్ల దానా) దిగుమతులను పశుసంవర్ధక శాఖ నిషేధించినట్లు తెలుస్తోంది. అవి ఇతర రాష్ట్రాల నుంచి రావడం ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుందని ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
తెలంగాణలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి కోళ్ల ఫారాల యాజమానులు తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని కోళ్ల ఫారాల్లో కోళ్లు చనిపోతే వెంటనే సంబంధిత వెటర్నీ దవాఖానలో సమాచారం ఇవ్వాలని యాజమానులకు సూచించారు. ఇప్పటికే బర్డ్ ప్లూ వ్యాధిపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో జిల్లాలోని కోళ్ల ఫారాల యాజమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వెంటర్నీ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు సహకరించాలని, ప్రతి సమాచారం అందించాలని కోళ్ల ఫారాల యాజమానులకు కలెక్టర్ సూచించారు.
చికెన్, గుడ్లు తినొచ్చా..
ఏపీలో బర్డ్ ప్లూ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో చికెన్, గుడ్లు తినే విషయంపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కోడి మాంసం, గుడ్లు తినవచ్చునని పశుసంవర్ధక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మాంసం, గుడ్లు తీసుకున్నా ప్రజల అరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకలేదు. కోడి మాసం, గుడ్లను బాగా ఉడకబెట్టి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు అంటున్నారు.