RS Praveen Kumar : బీఆర్ఎ‌స్‌లో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.. కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

RS Praveen Kumar : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తనతో నడిచిన అందరికి ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తాను ప్ర‌జా సేవ కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను తప్పా ప్యాకేజీల కోసం కాదని స్ప‌ష్టం చేశారు.

RS Praveen Kuma Joins BRS

RS Praveen Kumar : లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. బీఎస్పీని వీడిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే బీఎస్పీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన.. సోమవారం ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.  ఈ సందర్భంగా కేసీఆర్ ఆర్ఎస్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూల్ స్థానం నుంచి నుంచి ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు.

Read Also : ఖమ్మం పార్లమెంట్ బరిలో టీడీపీ? ససేమీరా అంటున్న బీజేపీ సీనియర్లు!

తెలంగాణ భవన్‌కు వెళ్లేముందు ప్రొపెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు బీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు.

ప్యాకేజీల కోసం కాదు.. ప్రజాసేవ కోసమే :
ఏదో ఆశించి తాను పార్టీలో చేరడం లేదని భేషరతుగానే బీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు వెల్లడించారు. రెండున్నరేళ్ల పాటు తనతో నడిచిన అందరికి ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తాను ప్ర‌జా సేవ కోస‌ం మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో చేరాను తప్పా ప్యాకేజీల కోసం కాదని స్ప‌ష్టం చేశారు.

రేవంత్, నేనూ పాలమూరు బిడ్డలమే :
కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప‌నిచేసే అవ‌కాశం లభించనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బహుజన వాదం, తెలంగాణ వాదం రెండు ఒకటేనని చెప్పారు. ఏ పార్టీలో తాను ఉన్న బహుజనుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని తెలిపారు. రేవంత్ రెడ్డి, తాను పాలమూరు బిడ్డలమేనని అన్నారు. కాంగ్రెస్‌లో చేరాలని తనకు పదవి కూడా ఆఫర్ చేశారనే విషయాన్ని వెల్లడించారు.

ఒకవైపు పొగుడుతూనే మరోవైపు రేవంత్ వార్నింగ్ ఇస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ వైపు వెళ్తే ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ సున్నితంగా హెచ్చరిస్తున్నారని, ఇలాంటి హెచ్చరికలను మానుకోవాలని సూచించారు. ప్రజాక్షేత్రంలో ఉండాలని ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుని వచ్చినట్టు తెలిపారు.

Read Also : జితేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు.. శ్రీనివాస్ గౌడ్ గురించి ఏమన్నారంటే?