Revanth Reddy : వైన్ షాపుల టెండర్ల పేరుతో రూ.2,500 కోట్లు కొల్లగొట్టారు, కమ్యూనిస్టులను కరివేపాకులా వాడుకుని వదిలేశారు- సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. Revanth Reddy - CM KCR

Revanth Reddy - CM KCR (Photo : Google)
Revanth Reddy – CM KCR : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నెలకొంది. కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇతర పార్టీల నుంచి నాయకులు హస్తం బాట పడుతున్నారు. తాజాగా మాజీమంత్రి ఏ చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరారు. చంద్రశేఖర్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఏ చంద్రశేఖర్ తో పాటు జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ లో చేరారు. చంద్రశేఖర్ తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారని, ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ సందర్భంగా మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ” తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ బొందలగడ్డ తెలంగాణగా మారింది. దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అంటున్నారు. అవును, తెలంగాణలో ఉన్నట్లుగా 60వేల బెల్టు షాపులు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు. వైన్ షాపుల టెండర్ల పేరుతో 2500 కోట్లు కేసీఆర్ కొల్లగొట్టారు. ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ నిర్మిస్తే.. కేసీఆర్ 7500 కోట్లకు తెగ అమ్ముకున్నారు.
Also Read..KCR Strategy: గులాబీ బాస్ టాప్‌గేర్.. కేసీఆర్ మార్కు చాణక్యం.. ఒకే దెబ్బతో అంతా సెట్!
సాగునీటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్. చరిత్ర తిరగేసి చూడు కాంగ్రెస్ ఏం చేసిందో తెలుస్తుంది. కాంగ్రెస్ ఏం చేసిందో..నాగార్జున సాగర్ కట్టమీద చర్చిద్దామా? కాళేశ్వరంలో లక్ష కోట్లు దిగమింగారు. కామారెడ్డిలో 22వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదు. కామారెడ్డికి గోదావరి నీళ్లు తెస్తేనే.. కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెట్టాలి.
కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించాము. కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్నా. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట మీరు ఓట్లు అడగొద్దు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చిన చోట మేం ఓట్లు అడగం. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారు. కమ్యూనిస్టులను కరివేపాకులా వాడుకుని వదిలేశారు. బీజేపీతో ఉన్న అనుబంధంతోనే కమ్యూనిస్టులను కేసీఆర్ వదిలేశారు. అందుకే ఏకపక్షంగా టికెట్లు కేటాయించుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలను ఓడించండి. కాంగ్రెస్ ను గెలిపించండి. 26న చేవెళ్లలో జరిగే సభను విజయవంతం చేయాలి.
Also Read..BJP Telangana: కాషాయ దళంలో హీట్‌పుట్టిస్తోన్న కిషన్ రెడ్డి, సంజయ్ వైఖరి!
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే… రైతులకు రూ.2లక్షల రుణమాఫీ. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. రూ.5లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. రూ.500 లకే గ్యాస్ సిలిండర్. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల సాయం అందిస్తాం” అని రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చారు.