Journalist Krishna Rao: ప్రముఖ జర్నలిస్ట్ సీహెచ్ వీఎం కృష్ణారావు కన్నుమూత

Senior Journalist CHVM Krishna Rao
CHVM Krishna Rao: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ వీఎం కృష్ణారావు అనారోగ్యంతో గురువారం ఉదయం హైదరాబాద్ (Hyderabad) లో కన్నుమూశారు. ఆయన పార్థీవదేహాన్ని గోపనపల్లి జర్నలిస్ట్ కాలనీలోని (gopanpally journalist colony) స్వగృహంలో ఉంచారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 47 ఏళ్ల పాటు పత్రికా రంగంలో ఆయన విశేష సేవలు అందించారు. 18 ఏళ్లపాటు డెక్కన్ క్రానికల్ ఇంగ్లీషు న్యూస్ పేపర్ లో బ్యూరో చీఫ్ గా పనిచేశారు. ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైరయిన తర్వాత కూడా విశ్లేషకుడిగా సేవలు అందించారు. వార్తా చానళ్ల డిబేట్లలో విశ్లేషకుడిగా వచ్చేవారు. దినపత్రికల్లో వ్యాసాలు రాసేవారు. ముఖ్యంగా సమకాలిన రాజకీయాలపై ఆయన రాసిన ఎన్నో వ్యాసాలు ప్రముఖ దినపత్రికల్లో వచ్చాయి.
మీడియా రంగానికి పూడ్చలేని లోటు
సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు మరణం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు. కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగి.. తెలుగు, ఇంగ్లీషు జర్నలిజంలో
మంచి ప్రావీణ్యం సంపాదించారని గుర్తు చేసుకుంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయ విశ్లేషణలో తన ముద్రవేసిన కృష్ణారావు మరణం మీడియా రంగానికి పూడ్చలేని లోటని ఏపీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.
కృష్ణారావు మరణం బాధాకరం
కృష్ణారావు మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సంతాపం తెలిపారు. పాత్రికేయ విలువలకు పట్టంగడుతూ.. తన రాతలు, విశ్లేషణల్లో ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిన కృష్ణారావు అనారోగ్యం కారణంగా మరణించడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. పెద్ద బాబాయిగా అందరికీ సుపరిచితులైన కృష్ణారావు గత నాలుగు దశాబ్దాలుగా పలు మీడియా సంస్థల్లో పనిచేస్తూ ఎనలేని సేవ చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంతాపం తెలిపారు. 4 దశాబ్దాలుగా పత్రిక రంగంలో రాజకీయ విశ్లేషణలో తనదైన ముద్ర వేసిన కృష్ణారావు మృతి చెందడం అత్యంత బాధాకరమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: వారి సూచనల మేరకే.. భక్తులకు కర్రల పంపిణీపై ట్రోల్స్.. స్పందించిన టీటీడీ చైర్మన్ భూమన
నిఖార్సైన జర్నలిస్టు
పాత్రికేయులందరూ కృష్ణారావు బాబాయ్ అని పిలుచుకునే సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ వీఎం కృష్ణారావు మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. నిఖార్సైన జర్నలిస్టుగా, పక్షపాతం చూపని రాజకీయ విశ్లేషకునిగా కృష్ణారావు ఎంతో పేరు పొందారని కొనియాడారు. కృష్ణారావు మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటని సంతాపం తెలిపారు. టీడీపీ యువనేత నారా లోకేశ్, ఎమ్మెల్యే నందమూరిబాలకృష్ణ కూడా కృష్ణారావు మరణం పట్ల సంతాపం వ్యక్తపరిచారు.