Sircilla : కొత్త కలెక్టరేట్ రెడీ, 56 శాఖలకు గదులు, విశేషాలివే
సిరిసిల్లలో కొత్త కలెక్టరేట్ రెడీ అయింది. సువిశాలమైన స్థలంలో ఆధునిక హంగులతో ముస్తాబైంది. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా సముదాయాలను నిర్మించగా, పేదలకు పాలన మరింత చేరువ కానుంది.

Siricilla
Sircilla New Collectorate : సిరిసిల్లలో కొత్త కలెక్టరేట్ రెడీ అయింది. సువిశాలమైన స్థలంలో ఆధునిక హంగులతో ముస్తాబైంది. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా సముదాయాలను నిర్మించగా, పేదలకు పాలన మరింత చేరువ కానుంది. జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం 93.3 ఎకరాల్లో 72 కోట్లతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. బైపాస్ రోడ్డులో 2017 నవంబర్ 11న ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేసి పనులు ప్రారంభించగా, అత్యాధునిక హంగులతో సిద్ధమైంది.
జీ ప్లస్ టూ పద్ధతిలో నిర్మిస్తున్న ఈ భవన సముదాయంలో మొత్తం 56 శాఖలకు గదులు కేటాయించేందుకు ఏ, బీ, సీ, డీలుగా బ్లాకులు విభజించారు. ఒక్కో బ్లాకులో 29 గదులున్నాయి. 800 మంది కూర్చుండేలా విశాలమైన సమావేశ మందిరం నిర్మించారు. భవనంపైన రెండంతస్థులకు వెళ్లడానికి మూడు వైపులా మెట్లతో పాటు లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అధికారుల నివాస గృహాల సముదాయాన్ని సైతం జీ ప్లస్ టూ విభాగంలో నిర్మాణం పూర్తి చేశారు. కలెక్టరేట్ పక్కనే ఎస్పీ కార్యాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. కలెక్టరేట్ ముఖద్వారానికి ఎదురుగా 70 మీటర్ల ఎత్తులో జాతీయ పతాకం ఎగిరేలా ఏర్పాటు చేశారు.