చెత్తపై సీసీ కన్ను : సిటీలో కంపును నానో చెప్పేస్తుంది

  • Published By: veegamteam ,Published On : January 24, 2019 / 10:04 AM IST
చెత్తపై సీసీ కన్ను : సిటీలో కంపును నానో చెప్పేస్తుంది

Updated On : January 24, 2019 / 10:04 AM IST

హైదరాబాద్ : నగరంలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు జీహెచ్ ఎంసీ సరికొత్త విధానాన్ని అవలంభిస్తోంది. పారిశుద్ధ్యం అనేది సమాజంలో జీవించే ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ ఎవరికి వారు నిర్లక్ష్యం చేయటంతో నగరంలో పారిశుద్ధం కొరవడుతోంది. ఈ క్రమంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు జీహెచ్ ఎంసీ నిర్ణయించింది. ఈ క్రమంలో నానో కార్లతో నిఘాను ఏర్పాటు చేయనుంది. ఆకారంలో చిన్నగా వుంటు ఇరుకైన గల్లీల్లోనూ తిరిగేలా వీలుండే నానో కారుకు మూడేసి సీసీ కెమెరాలు అమర్చి నిఘా పెట్టనుంది. దీంతో రోడ్లపై చెత్త వేసే వారిని, అపరిశుభ్రత, ఇతర నిబంధనలను  ఉల్లంఘనలను పాల్పడేవారిని  గుర్తించేందుకు సాధ్యపడుతుందని బల్దియా భావించింది. 

నగరంలో చెత్త సేకరణ సక్రమంగా జరగక పోవడం, ఇతరత్రా నిర్లక్ష్యాలతో నగరంలో పలు ప్రాంతాలలో పారిశుద్ధ్యం కొరవడుతోంది. హోటళ్లు, ఇతర బిజినెస్ సంస్థలు రోడ్లపైకి యథేచ్ఛగా మురుగును వదిలేస్తున్నాయి. క్వాలిటీ లేని  మ్యాన్‌హోళ్లు తరచూ రిపేర్స్..వీధుల్లో బహిరంగ మూత్ర విసర్జన, ఏ చిన్న జాగా కనిపించినా అక్కడ చెత్త వేయటంతో నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయి. 

వీటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నా..ఫలితం మాత్రం శూన్యంగా ఉంది. దీంతో ఐటీ ఉపయోగించాలనే జీహెచ్ ఎంసీ నిర్ణయించుకుంది. దీంట్లో భాగంగా..సహాయ ఇంజినీర్లను ఇటీవల వార్డు స్వచ్ఛ అధికారులుగా నియమించారు. వారికి 150 ట్యాబ్‌లను అందివ్వగా, 130 ట్యాబ్‌ల సమాచారం బల్దియా కేంద్ర కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి చేరుతోంది. దాంతోపాటు క్షేత్రస్థాయిలో గల్లీగల్లీకి తిరిగి వీడియోలు చిత్రీకరించే నానో నిఘా వ్యవస్థకు రూపమిచ్చామని ఐటీ విభాగం అదనపు కమిషనర్‌ ముషరఫ్‌ అలీ ఫారుఖి తెలిపారు.

నానోతో  నిఘా ఇలా..
నానో కారు ముందు భాగంలో అటు, ఇటు తిరిగే మూడు సీసీ కెమెరాలు ఉంటాయి. అవి చిత్రీకరించే దృశ్యాలు కారులో కంప్యూటర్‌ తెరపై కనిపిస్తుంటాయి. కేంద్ర కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం, ఉన్నతాధికారుల సెల్‌ఫోన్లలోనూ వాటిని చూడొచ్చు. వాటిని పరిశీలిస్తూ మౌలిక సౌకర్యాల కల్పనలోని లోపాలను గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు. దాంతోపాటు ఉల్లంఘనులకు జరిమానాలు విధించే విధానంపైనా అధికారులు కసరత్తు చేస్తున్నారు.  జోన్‌కు ఒకటి చొప్పున, ఆరు జోన్లకూ వాహనాలను అందజేయాలని ప్రతిపాదించారు. ఇప్పటికే ఖైరతాబాద్‌ జోన్‌లో ఒక నానో కారును  ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసామని జిహెచ్ఎంసి కమిషనర్ ఎం డానా కిషోర్ చెప్పారు. 

నేరాలను పరిష్కారంలోనే కాక పౌర సేవల వినియోగంలో కూడా ఐటీ కీలక పాత్ర వహిస్తోందని జనవరి 23న నానో నిఘా వాహనాన్ని బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రారంభించిన సందర్భంగా కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో స్వచ్ఛ విజిల్‌ యాప్‌ను మొబైల్‌ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామని..ఈ యాప్ తో నగరవాసులు స్వచ్ఛతకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అందులో అప్‌లోడ్‌ చేయాలని ఎం.దానకిశోర్‌ కోరారు.