బీఆర్ఎస్‌కు శ్రీకాంతాచారి తల్లి రాజీనామా.. కాంగ్రెస్ పార్టీలో చేరిక

శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేశారు.

బీఆర్ఎస్‌కు శ్రీకాంతాచారి తల్లి రాజీనామా.. కాంగ్రెస్ పార్టీలో చేరిక

Kasoju Shankaramma: మలిదశ తెలంగాణ పోరాటంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేశారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. హుజుర్‌న‌గ‌ర్‌కు నుంచే పలువురు నాయకులు కూడా హస్తం గూటికి చేరుకున్నారు.

అందుకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసా
బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎలాంటి న్యాయం జరగలేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని శంకరమ్మ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ లోక్‌స‌భ‌ స్థానాలు గెలవడం కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గత జనవరిలో శంకరమ్మ మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే.

శంకరమ్మకి పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తాం
నల్గొండ జిల్లాకు చెందిన వందలాది మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తమ పార్టీలో చేరడానికి ఉత్సాహంగా ఉన్న నేతలను చేర్చుకోవాలని ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. శంకరమ్మ కుటుంబం రాష్ట్రానికి చేసిన త్యాగం కాంగ్రెస్ పార్టీ మరవదని, ఆమెకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. హుజుర్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయని వెల్లడించారు.

Also Read: మాకు 10 సీట్లు ఇస్తే.. కేసీఆర్ శాసించే స్థాయికి వస్తారు- కేటీఆర్

మోదీ దిగజారి మాట్లాడుతున్నారు
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అబద్ధాలు ప్రచారం చేస్తూ గెలవాలని ప్రయత్నం చేస్తున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీ దిగజారి మాట్లాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసిన అభివృద్ధి శూన్యమని ధ్వజమెత్తారు. అదానీ.. కాంగ్రెస్ మనిషి అన్నట్లు మోదీ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న సమాచారంతోనే మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కేసీఆర్ 10 ఏళ్లు సీఎంగా వుండి రాష్ట్రాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెస్పీ ధరకు ప్రభుత్వమే కొంటుందని, ఎన్నికలు పూర్తవగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీయిచ్చారు.