Sahasra Case : వామ్మో.. సహస్ర హత్యకేసులో నమ్మలేని నిజాలు.. ఆ వెబ్‌సిరీస్‌లు, క్రైమ్ మూవీలు చూసి.. క్రికెట్ బ్యాట్ చోరీకి వచ్చి.. గుట్టు వీడిందిలా..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) మిస్టరీ వీడింది. సహస్రను హత్య చేసింది పక్కింట్లో ఉండే

Sahasra Case
Sahasra Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) మిస్టరీ వీడింది. సహస్రను హత్య చేసింది పక్కింట్లో ఉండే పదో తరగతి బాలుడేనని పోలీసులు తేల్చారు. అయితే, ఈ హత్యకేసుకు సంబంధించి పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
బాలుడిపై అనుమానం ఎలా వచ్చిందంటే..?
కూకట్‌పల్లి దయార్‌గూడలోని బిల్డింగ్ పెంట్ హౌస్‌లో ఈనెల 18న మధ్యాహ్నం సహస్ర దారుణ హత్యకు గురైంది. ఆమె ఒంటిపై దాదాపు 20వరకు కత్తి పోట్లు ఉండడంతో ఎవరో కావాలనే పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు. ఈ మేరకు విచారణ చేపట్టారు. పలు విధాలుగా విచారణ అనంతరం పక్కింట్లో ఉండే టెన్త్ క్లాస్ చదివే బాలుడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు ఆ బాలుడిని సహస్ర హత్య గురించి విచారించారు. ‘అంకుల్ సహస్ర నాకు తెలుసు.. చాలా మంచిది. ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నాను. డాడీ… డాడీ.. డాడీ అని సహస్ర పిలిచినట్లు అరుపులు వినిపించాయి’ అంటూ బాలుడు పోలీసులుకు చెప్పాడు. దీంతో సహస్ర హత్యరోజు ఆమె అరుపులు ఏమైనా వినిపించాయా అని చుట్టుపక్కల వారిని పోలీసులు ఆరా తీశారు. కానీ, మాకు సహస్ర అరుపులు ఏమీ వినిపించలేదని చెప్పారు. దీంతో ఆ బాలుడికి మాత్రమే సహస్ర అరుపులు వినిపించడం ఏమిటి అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
అసలు గుట్టు వీడిందిలా..
సహస్రను హత్యచేసింది ఆమె పక్కింట్లో ఉండే టెన్త్ క్లాస్ చదివే బాలుడేనని పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆ బాలుడి ప్రవర్తన గురించి పోలీసులు స్థానికులను ఆరా తీశారు. బాలుడు కొంచెం ర్యాష్‌గా ఉండేవాడని, బిల్డింగులు ఎక్కి దూకుతాడని కొందరు చెప్పారు. సహస్ర హత్యకు సంబంధించి ఇంటి పరిసరాల్లోని సీసీ కెమెరాల్లో చూసినప్పుడు బయటి నుంచి ఎవరూ రాలేదని తేలింది. అయితే, బిల్డింగ్ దూకి వచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు భావించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులకు బాలుడిపై అనుమానం పెరిగింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. కానీ, ఆ బాలుడు మాత్రం.. తనకేమీ తెలియదని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అప్పటికే బాలుడే హత్య చేశాడని కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు.. బాలుడి తల్లిదండ్రులను కూడా పిలిపించి విచారించారు. దీంతో బాలుడు తానే సహస్రను హత్య చేసినట్లు అంగీకరించాడు. అయితే, బాలుడు సహస్రను హత్యచేసిన రోజు అతడు వేసుకున్న దుస్తులకు రక్తపు మరకలు కనిపించినా తల్లిదండ్రులు మందలించలేదు. బాలుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దుస్తులు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
చోరీ విషయం బయటపడుతుందనే సహస్రను చంపేశాడు..
బాలుడు రోజూ ఓటీటీల్లో క్రైమ్ వెబ్‌సిరీస్‌లు చూసేవాడు. అందులోనూ దోపిడీలు, దొంగతనాలకు సంబంధించిన క్రైమ్ సిరీస్‌లను ఎక్కువగా చూసేవాడు. బాలుడి కుటుంబం పెంట్ హౌస్ లో ఉంటుండగా.. ఆ పక్క బిల్డింగ్ లోని పెంట్ హౌస్ లో సహస్ర కుటుంబం ఉంటుంది. ఈ క్రమంలో తన చోరీ ప్లాన్ అమలు చేసేందుకు సహస్ర ఇంటిని బాలుడు ఎంచుకున్నాడు. క్రైమ్ వెబ్‌సిరీస్‌లో దొంగతనం చేయాలని భావించి.. అందులో ఎలా దొంగతనం చేయాలి.. ఎలా తప్పించుకోవాలనే విషయాలను నోట్ లో రాసుకున్నాడు. అందులో ‘కత్తితో లాక్ కట్ చేసి ఇంట్లోకి ప్రవేశించాలి.. గ్యాస్ సిలిండర్ ను టేబుల్ వద్దకు జరపాలి.. తరువాత క్యాష్ తీసుకోవాలి.. గ్యాస్ సిలిండర్ పేలిపోయేలా దాన్ని లీక్ చేసి మళ్లీ డోర్ లాక్ చేసి తప్పించుకోవాలి..’’ అని ఇంగ్లీష్ లో ఆ నోట్ లో బాలుడు రాసుకున్నాడు. అయితే, ఈ నోట్ లో చోరీ ఎలా చేయాలన్నది మాత్రమే ఉంది.. ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలో రాసుకోలేదు. దీన్ని బట్టి చూస్తే బాలుడికి సహస్రను హత్య చేయాలని ప్లాన్ లేదు. కేవలం.. తన చోరీ విషయాన్ని సహస్ర తన కుటుంబ సభ్యులకు చెబుతుందనే భయంతోనే బాలుడు సహస్రను హత్య చేసినట్లు తెలుస్తుంది.
బాలుడ్ని సహస్ర ఎలా చూసింది..
బాలుడు తాను నోట్ లో రాసుకున్న విధంగా చోరీకి పాల్పడాలని భావించారు. ఇందులో భాగంగా తన వద్ద ఉన్న కత్తిని తన వెంట తీసుకెళ్లాడు. ఉదయం 11గంటలకు తమ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్ లోకి జంప్ చేసి సహస్ర ఇంట్లోకి వెళ్లాడు. ఆ తరువాత నెమ్మదిగా డోర్ తెరిచి లోపలకు వెళ్లాడు. అప్పటికే సహస్ర బెడ్ పై పడుకొని టీవీ చూస్తుంది. ఏదో అలికిడి రావడంతో డోర్ వైపు చూడగా పక్కింటి బాలుడు రావడాన్ని గుర్తించింది. ఎందుకు ఇంట్లోకి వచ్చావు అంటూ ప్రశ్నించింది. మా అమ్మానాన్న వచ్చాక నీ గురించి చెప్తా.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ బాలుడిని హెచ్చరించింది. సహస్రకు విషయం తెలియడంతో తన గుట్టు ఎక్కడ బయటపడుతుందోననే భయంతో సహస్ర దగ్గరకు వెళ్లిన బాలుడు ఆమెను పట్టుకొని తన వెంట తెచ్చుకున్న కత్తితో మెడపై 15పోట్లు, కడుపుపై ఐదు పోట్లు పొడిచాడు. తరువాత తలుపుకు గొల్లెం పెట్టి మళ్లీ తన బిల్డింగుపైకి దూకి వెళ్లిపోయాడు.
చోరీకి సహస్ర ఇంటినే ఎందుకు ఎంచుకున్నాడు..
సహస్ర తమ్ముడి దగ్గర ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఉంది. అది తనకు కూడా కావాలని తరచూ నిందితుడు అడిగేవాడు. ఒక్కోసారి ఇవ్వకపోవడంతో కోపంతో వాళ్ల ఇంట్లోనే చోరీ చేసి ఆ డబ్బులతో బ్యాట్ కొనాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. చోరీ చేయడానికి సహస్ర ఇంటిని ఎంచుకోవడానికి దీన్నికూడా ఓ కారణంగా పోలీసులు చెబుతున్నారు. అయితే, పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో ఇంకెన్ని నమ్మలేని నిజాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిందే.
Also Read: Mobile Usage: మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా.. ఈ చిన్న చిట్కా పాటించండి.. మొబైల్ మొహం కూడా చూడరు