కేటీఆర్‌కు పగ్గాలు.. కేసీఆర్‌ వెనుకుండి నడిపిస్తారు!

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో నాయకత్వ మార్పుపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు వరుసగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యి, తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేటీఆర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్‌ సీఎం అయ్యేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

కేసీఆర్‌ తర్వాత సీఎం పదవి కేటీఆర్‌కే దక్కుతుందని, సీఎం అయ్యేందుకు కేటీఆర్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయని అన్నారు. ఈ అంశంలో తుది నిర్ణయం సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. కేసీఆర్‌‌లేని తెలంగాణను ఊహించుకోలేమని.. తనయుడికి పగ్గాలు ఇచ్చినా…వెనకుండి కేసీఆర్‌ నడిపిస్తారని అన్నారు. హరీష్ రావు నుంచి వ్యతిరేకత వస్తుందనే వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

ఈ సమయంలోనే ఉద్యోగసంఘాల డిమాండ్ చేస్తున్న పీఆర్సీ ఫిట్‌మెంట్‌.. బడ్జెట్‌కు భారం అవుతుందని అన్నారు. దేవుళ్లపై రాజకీయాలు, బలవంతపు విరాళాలూ తగవన్నారు. కేసుల భయంతోనే కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మద్దతిచ్చిందన్న వాదనను తిప్పికొట్టారు.

పీఆర్‌సీపై నెలకొన్న వివాదంపై స్పందించిన శ్రీనివాస్‌గౌడ్..ఏడున్నర శాతం ఫిట్‌మెంట్‌కు తాము కూడా అంగీకరించలేదన్నారు. కొంతమంది 60,70 శాతం ఫిట్‌మెంట్‌ అడుగుతున్నారని…అంత ఇస్తే బడ్జెట్‌ మొత్తం ఉద్యోగుల జీతాలకే సరిపోతుందన్నారు. పీఆర్‌సీపై త్వరలోనే స్పష్టత వస్తుందని, అది ఉద్యోగులకు సంతృప్తినిస్తుందని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు