అమ్మవారి దేవాలయం ఐదు దర్వాజాల్లోంచి ప్రసరించిన సూర్యకిరణాలు..!!

అమ్మవారి దేవాలయం ఐదు దర్వాజాల్లోంచి ప్రసరించిన సూర్యకిరణాలు..!!

Sunrise From The Windows Lalithambika Temple (1)

Updated On : March 22, 2021 / 4:41 PM IST

Sunrise from the windows lalithambika temple : శిల్పులు అనగానే మనకు అమర శిల్పి జక్కన్న గుర్తుకొస్తారు. అద్భుతమైన శిల్పాలు చెక్కటంతో ఆయనకు ఆయనే సాటి అనే పేరు తెచ్చుకుని చరిత్రలో నిలిచిపోయారు. ఎవరైనా అద్భుతమైన శిల్పాలు చెక్కితే ‘జక్కన్న’అంటారు. అటువంటి ఎంతోమంది గొప్ప గొప్ప శిల్పులకు భారతదేశం పెట్టింది పేరు. చేతిలో సుత్తి, ఉలి ఉంటే చాలు బండరాళ్లను కూడా అత్యద్భుతమైన శిల్పాలుగా మలిచేస్తారు మన శిల్పులు. మన భారతదేశపు దేవాలయాలపై శిల్పాలను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అది శిల్పమా? లేదా ప్రాణం ఉన్న వ్యక్తా అనిపిస్తుంది.

దేవాలయాల నిర్మాణాల్లో శిల్పుల అత్యద్భుతమైన ప్రతిభ చూస్తే కళ్లు తిప్పుకోవాలనిపించదు. వారి చాతుర్యం చూస్తే అబ్భురమనిపిస్తుంది. అటువంటి ఓ అత్యద్భుతమైన శిల్పుల పనితనానికి మచ్చు తునక లలితాంబికా తపోవనం రాజగోపురాన్ని చూస్తే కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది.ఆలయ నిర్మాణాల్లో శిల్పులు తమ ప్రత్యేకతకు చాటుకోవటం పరిపాటి. అలాంటి కోవలోనే తెలంగాణ రాష్ట్రంలోని జడ్చర్ల మండలం గొల్లపల్లి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న లలితాంబికా తపోవనం రాజగోపురం నిలుస్తోంది.

లలితాంబికా తపోవనం రాజగోపురానికి ఐదు గవాక్షాలు ఉన్నాయి. ఆ గవాక్షాలలో సూర్యుడు ఉదయించే సమయంలో సూర్య కిరణాలు ఆ గవాక్షాల్లోంచి లోపలికి చొచ్చుకొస్తాయి. ఆ గవాక్షాల్లోంచి సూర్యకిరణాలు పయనించే అద్భుం చూసి చూడవలసిందే. అదే ఈ అరుదైన ఫోటో.

ఆదివారం (మార్చి 21,2021) కనిపించిన సుందర దృశ్యాలను ఓ ఫోటో గ్రాఫర్ తన కెమెరాలో బంధించారు. సాధారణంగా భక్తులు గవాక్షాలను అంతస్తులుగా పిలుస్తారు. ఒక్కో గవాక్షం ఒక్కో అంతస్తుగా, గవాక్షాన్ని దర్వాజగా భావిస్తారు. ఆ దర్వాజలో నుంచే సూర్యోదయం జరగటాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఇది మన శిల్పుల పనితనానికి మచ్చు తునక అను ప్రశంసించారు.