భార్య డీమార్ట్ నుంచి తిరిగి వచ్చేసరికి.. ఘోరం జరిగిపోయింది

భార్య డీమార్ట్ నుంచి తిరిగి వచ్చేసరికి.. ఘోరం జరిగిపోయింది

Updated On : February 22, 2021 / 5:34 PM IST

tcs software engineer suicide: హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని వెంగళరావునగర్‌ డివిజన్‌ సిద్ధార్థనగర్‌లో జరిగింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పాపిరెడ్డిపల్లెకు చెందిన నడిశెట్టి బాలశ్రీధర్ (44) నాలుగేళ్లుగా టీసీఎస్ లో(టాటా కన్సల్టెన్సీ సర్వీస్) మేనేజర్ గా పని చేస్తున్నాడు.

గతంలో ఆయన బంధువులు, స్నేహితులకు అప్పులు ఇచ్చాడు. అవి వసూలు కాకపోవడంతో ఇతరుల దగ్గర అప్పులు చేశాడు. ఇచ్చిన అప్పులు వసూలు కాకపోవడం, తీసుకున్న అప్పు చెల్లించడం కష్టంగా మారాయి. దీంతో గతంలోనే ఓసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు మనోవేదన అనుభవించాడు.

సిద్దార్థనగర్ లో బాల శ్రీధర్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. శ్రీధర్ భార్య పద్మ ఆదివారం(ఫిబ్రవరి 21,2021) ఉదయం పిల్లలను తీసుకుని డీమార్ట్ కి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. డీమార్ట్ నుంచి తిరిగి వచ్చిన పద్మకు భర్త విగత జీవిగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.