10th Class Results: తెలంగాణలో టెన్త్ ఫలితాలపై కీలక అప్డేట్.. ముగిసిన మూల్యాంకనం.. ఫలితాలు విడుదల ఆలస్యమవుతుందా..? ఎందుకంటే..

రాష్ట్రంలో పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని తొలగించి గతంలో మార్కులు ఇస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, మెమోల ముద్రణ..

10th Class Results: తెలంగాణలో టెన్త్ ఫలితాలపై కీలక అప్డేట్.. ముగిసిన మూల్యాంకనం.. ఫలితాలు విడుదల ఆలస్యమవుతుందా..? ఎందుకంటే..

10th Class Results

Updated On : April 16, 2025 / 11:21 AM IST

TG 10th Class Results: తెలంగాణలో పదవ తరగతి పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. తాజాగా.. ఈ అంశంపై అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు. మంగళవారం జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది. వారం రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది.. కానీ, ఈ సారి ఫలితాల ప్రకటన ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.

 

రాష్ట్రంలో పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని తొలగించి గతంలో మార్కులు ఇస్తామని ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, మెమోల ముద్రణ ఎలా ఉండాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో మెమోలపై సర్కారు నిర్ణయం కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకుంటే ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు పదో తరగతి మెమోలపై మార్కులు ఆధారంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి విభాగాల్లో పాస్ అయినట్లు, ఫెయిల్ అయితే.. ఫెయిల్ అని రాసేవారు. తొలుత ఈసారి మెమోల్లో పాస్, ఫెయిల్ అని ఇస్తే సరిపోతుందని భావించారు. కానీ, ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మెమోలపై ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ లలో పాస్, 35శాతం మార్కులు కన్నా తగ్గితే ఫెయిల్ అని ముద్రించాలంటూ ప్రభుత్వానికి ఎన్సీఈఆర్టీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే, ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టత రాలేదని తెలుస్తోంది.

 

మరోవైపు గ్రేడింగ్ విధానాన్నే కొనసాగించాలని ట్రస్మా తరపున ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. మార్కులను ప్రవేశపెడితే కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని ట్రస్మా చెబుతుంది. మొత్తానికి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయినప్పటికీ.. ఫలితాల మాత్రం ఆలస్యం అవుతాయని, ఈ నెలాఖరు వరకు సమయం పడుతుందని తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం నుంచి రెండుమూడు రోజుల్లో మెమోల ముద్రణ ఎలా ఉండాలన్నదానిపై స్పష్టత వస్తే మరో వారం రోజుల్లో ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.