Telangana: తెలంగాణకు క్యూ కడుతున్న బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Telangana Election Campaign

Telangana Election Campaign:  తెలంగాణ పోరులో ప్రచార పర్వంపై ఫోకస్ పెడుతున్నాయి పార్టీలు.. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుండటం… మరో వారంలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండటంతో క్షేత్రస్థాయిలో దూసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ప్రచారం స్టార్ట్ చేసినా.. దసరా సందర్భంగా రెండు రోజులు విరామం వచ్చింది. ఇక నుంచి విరామం లేకుండా చివరి రోజు వరకు ప్రచార కార్యక్రమాలకు షెడ్యూల్ ఖరారు చేస్తున్నాయి

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. షెడ్యూల్ విడుదలైన తర్వాత అభ్యర్థుల ఎంపికలు.. పార్టీలో వలస నేతల చేరికలు.. అసంతృప్తులు, అసమ్మతుల బుజ్జగింపుల ఆంకంపైనే ప్రధానంగా దృష్టిపెట్టిన పార్టీలు.. ఇక గేరు మార్చి ప్రచారం హోరెత్తించాలని డిసైడ్ అయ్యాయి. ఇప్పటికే ఓ విడత ప్రచారం చేసిన పార్టీలు.. ఇక ఎన్నికల ప్రచార గడువు ముగిసేవరకు ప్రజల్లో ఉండేలా టూర్ షెడ్యూల్‌ను విడుదల చేస్తున్నాయి.

26 నుంచి జనంలోకి బీఆర్‌ఎస్ బాస్ కేసీఆర్
హుస్నాబాద్ నుంచి ప్రచారం స్టార్ట్ చేసిన బీఆర్‌ఎస్ బాస్ కేసీఆర్.. 26 నుంచి రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలకు రెడీ అయ్యారు. 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడు నియోజకవర్గాల్లో పర్యటించనున్న సీఎం.. ఆ మరునాడు పాలేరు, మహబూబాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగిస్తారు. ఇక బీఆర్‌ఎస్ తరఫున సీఎంతోపాటుగా ప్రచార బాధ్యతలు చూస్తున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు వంద నియోజకవర్గాలను చుట్టేశారు. మళ్లీ రెండో విడత ప్రచారానికి రెడీ అవుతున్నారు. త్రిశూల వ్యూహం మాదిరిగా బీఆర్‌ఎస్‌లో ఈ ముగ్గురు నేతలు చెరోవైపు వెళుతూ తమ ప్రభుత్వంలో అమలు చేస్తున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు.

26 నుంచి నుంచి ఇంటింటికీ కాంగ్రెస్
ఇక బీఆర్‌ఎస్ ప్రచారానికి దీటుగా కాంగ్రెస్ కూడా క్షేత్రస్థాయికి దూసుకెళ్లేలా ప్లాన్ చేస్తోంది. 26, 27 తేదీల్లో కాంగ్రెస్ గ్యారెంటీ స్కీమ్‌లపై రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా ప్రచారం చేయాలని షెడ్యూల్ విడుదల చేసింది కాంగ్రెస్.. మరోవైపు 28 నుంచి రెండో విడత బస్సు యాత్రకు రూట్ ఖరారు చేసింది. 28 నుంచి 30వ తేదీ వరకు కాంగ్రెస్ నిర్వహించే బస్సు యాత్రలో కర్ణాకట సీఎం సిద్ధరామయ్య ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత 31 నుంచి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకతో ప్రచారం చేయనున్నారు. 31న కొల్లాపూర్‌లో జరిగే పాలమూరు ప్రజాభేరి సభలో ప్రసంగించనున్నారు ప్రియాంక.. ఆ వెంటనే రాహుల్‌గాంధీ కూడా రాష్ట్రానికి రానున్నట్లు చెబుతున్నారు. ఇలా వరుసగా బడా నేతల టూర్ షెడ్యూల్‌తో బిజీబిజీ ఉంటోంది కాంగ్రెస్.

Also Read: బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అమిత్ షాకు రుణపడి ఉంటానని వెల్లడి

27న నల్లగొండకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
ఇదే సమయంలో బీజేపీ కూడా జోరు పెంచుతోంది. ఈ నెలలోనే రాష్ట్రంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. పార్టీ అధ్యక్షుడు నడ్డా ప్రచారం చేశారు. ఇక తొలి విడత జాబితా విడుదల.. దసరా పండగతో అగ్రనేతల పర్యటనలకు మధ్యలో బ్రేక్ పడింది. సమయం సమీపిస్తుండటంతో ఇక ప్రచారం ఉధృతం చేయాలని నిర్ణయించింది కమలం పార్టీ. 27న హోంమంత్రి అమిత్‌షా నల్లగొండ రానున్నారు. ఆ తర్వాత నెలాఖరు వరకు పలువురు బీజేపీ అగ్రనేతలను ప్రచారంలోకి దింపుతోంది కమలదళం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పతోపాటు పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు.

Also Read: టార్గెట్ రేవంత్ రెడ్డి.. పాలేరుతో పాటు కొడంగల్ నుంచి వైఎస్ షర్మిల పోటీ?

మూడు పార్టీలూ పోటాపోటీగా ప్రచారంపై ఫోకస్ పెట్టడంతో రాష్ట్రంలో ఎటుచూసినా సందడే కనిపిస్తోంది. ఒకవైపు రాష్ట్ర నేతలు.. మరోవైపు జాతీయ నేతల హంగామాతో ఎక్కడకి వెళ్లినా నేతలు, కార్యకర్తలతో కోలాహలం కనిపిస్తోంది.