SC Classification Bill : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..
ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

SC Classification Bill : ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు కూడగట్టింది. ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన అందరికీ సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బిల్లుకు అందరూ సంఘీభావం తెలపడం సంతోషంగా ఉందన్నారాయన. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు బిల్లుకు సభ ఆమోదం తెలపడంతో.. ముఖ్యమంత్రి రేవంత్ కి అభినందనలు తెలియజేశారు ఎమ్మెల్యేలు.
ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపాయన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మాట్లాడారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. 2004 నుంచి ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉన్నాయన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, ఈ పోరాటంలో అనేక మంది ప్రాణాలు విడిచారని చెప్పారు.
దళిత జాతి అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందన్నారు. దళితులకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించిందని సీఎం రేవంత్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన గంటలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుపై నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
Also Read : ఆ సీటుకు బైపోల్ పక్కానా? వాళ్లు డిసైడ్ అయ్యారా? కేటీఆర్ భేటీ అందుకేనా?
క్యాబినెట్ సబ్ కమిటీ ఆరుసార్లు సమాలోచనలు చేసిందన్నారు. వన్ మ్యాన్ కమిషన్ అందరి అభిప్రాయాలు తీసుకుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లలో దళిత ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. రాజీవ్ యువ వికాసంలోనూ ఎస్సీ వర్గీకరణ పోరాట అమరవీరుల కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు సీఎం రేవంత్. ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకబోతోందని ఆయన అన్నారు. 2026 జనాభా లెక్కల ప్రకారం గ్రూప్ 1, 2, 3 పోస్టుల్లోనూ రిజర్వేషన్లు పెంచుతామని పేర్కొన్నారు.