Telangana assembly session
Telangana assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో 10 ప్రశ్నలు చర్చకు వస్తాయి.
హరితవనాల పెంపు, రాష్ట్రంలో పామాయిల్ తోటల పెంపకం, నూతన వైద్య కళాశాల ఏర్పాటు, సింగరేణి బొగ్గు గనుల వేలం, తలసరి ఆదాయం పెరుగుదల, మిషన్ భగీరథ పథకం కోసం రుణాలు, గ్రామ పంచాయతీలుగా తండాలు, గిరిజన ఆదివాసీ గూడేలు, నూతన వ్యవసాయ కళాశాలల ఏర్పాటు, దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులకు మరమ్మతులు, అనంత పద్మనాభ స్వామి దేవాలయ పునర్నిర్మాణం, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా వచ్చిన ఫలితాలపై చర్చ జరగనుంది.
అసెంబ్లీ సమావేశాలు ఆదివారం కూడా కొనసాగనున్నాయి. సీఎం కేసీఆర్ ఆదివారం కీలక ప్రసంగం ఇవ్వనున్నారు.
శాసన మండలిలో వివిధ అంశాలపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. పోడుభూములు, వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సాయం, ఇతర అంశాలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివరాలు అడిగారు. ఆయా శాఖల మంత్రులు వివరణ ఇచ్చారు.
యూత్ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అల్మాస్ గూడ గ్రీన్ జోన్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణలో మత్స్య సంపద భారీగా పెరిగిందని చెప్పారు.
ప్రజల సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. సభలో మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంలో గవర్నర్ తమిళిసై మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని అన్నారు.
శాసనసభలో శుక్రవారం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై శనివారం చర్చించి ఆమోదించనుంది సభ. గిరిజన బంధు, పోడు భూముల పట్టాల పై వాయిదా తీర్మానం ప్రవేశపెడతారు.
శాసన సభలో కాంగ్రెస్.. నిరుద్యోగ భృతి ఇవ్వని పరిస్థితి, నిరుద్యోగ సమస్యలు గురించి వాయిదా తీర్మానాలకు పట్టుబట్టనుంది. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడం, అందుకు సంబంధించిన విధి విధానాలు వెంటనే రూపొందించే అంశంపై శాసన మండలిలో చర్చించనున్నారు.