Minister Komatireddy : ఢిల్లీలో సకల సౌకర్యాలతో తెలంగాణ భవన్ నిర్మాణం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి : మంత్రి కోమటిరెడ్డి
ఉమ్మడి భవన్ విభజనలో ఎలాంటి వివాదాలు లేవని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఖరి వేరు.. తమ ప్రభుత్వ వైఖరి వేరని తెలిపారు.

Minister Komatireddy Venkat Reddy
Minister Komatireddy Venkat Reddy : ఢిల్లీలో తెలంగాణకు కొత్త భవన్ ను నిర్మించనున్నట్లు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. సకల సౌకర్యాలతో తెలంగాణ భవన్ ను నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ భవన్ నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్ నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైందన్నారు. మార్చిలోగా తెలంగాణ భవన్ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏప్రిల్ నాటికి భవన్ నిర్మాణం పనులు చేపట్టాలని భావిస్తున్నామని తెలిపారు.
ఢిల్లీలో ఇరు రాష్ట్రాల ఉమ్మడి భవన్ ఆస్తుల పంపకంపై మంగళవారం చర్చించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఉమ్మడి భవన్ విభజనలో ఎలాంటి వివాదాలు లేవని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఖరి వేరు.. తమ ప్రభుత్వ వైఖరి వేరని తెలిపారు. ఇది తెలుగు రాష్ట్రాల సొంత ఆస్తి కాదని లీజు ప్రాపర్టీగానే భావించాలన్నారు. దీన్ని పంచుకునే విషయంలో వివాదం అనవసరమని చెప్పారు.
ఉమ్మడి భవన్ విభజనపై వివిధ ప్రతిపాదనలు
ఉమ్మడి భవన్ ను ఎలా విభజించాలన్న విషయంపై వివిధ ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అన్నింటి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీ చీఫ్ సెక్రటరీతో తమ సీఎస్ మాట్లాడారని, అవసరమైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మాట్లాడుకుంటారని పేర్కొన్నారు.
ఇప్పటికీ ఈ భవన్ ఏపీ భవన్‌గానే ప్రాచుర్యం పొందిందన్నారు. తెలంగాణ ఏర్పాటై ఇన్నేళ్లైనా సొంత భవన్ లేదని వాపోయారు. కేవలం ఏడాది కాలంలో నిర్మించే భవనం కోసం ఇన్నేళ్లు అపరిష్కృతంగా ఉంచారని పేర్కొన్నారు. మార్చి-ఏప్రిల్‌లోగా కొత్త భవన్ కోసం ప్లానింగ్, ఆర్కిటెక్చర్ పూర్తి చేసి నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు.
Anjani Kumar : మాజీ డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా గత ప్రధాని మన్మోహన్,సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయమని గుర్తు చేశారు. అది ఏపీని ఆదుకోవాలని పార్లమెంట్ లో ఇచ్చిన హామీ అని పేర్కొన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీ అమలు పరచకపోవడం బాధాకరం అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ప్రధాని హోదాలో మన్మోహన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారని, ప్రస్తుత ప్రధాని దానిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ ఏపీకి ప్రత్యేక హోదాను అమలు చేయాలని డిమాండ్ చేశారు.