Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
Telangana Cabinet
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రజాపాలన వారోత్సవాల తరువాత ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది.
డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో తమ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందనే విషయాన్ని ప్రజాపాలన వారోత్సవాల్లో వివరించాలని మంత్రివర్గం తీర్మానించింది. గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రచారం చేసి.. లోక్‌బాడీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని నిర్ణయించింది. ప్రజాపాలన వారోత్సవాలు పూర్తయిన తరువాత డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, బీసీ రిజర్వేషన్ల అంశంపైనా కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది.
Also Read : TG LT Recruitment: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి.. షరతులు వర్తిస్తాయ్..
మరోవైపు సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 45మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీళ్లంతా హైదరాబాద్ వాసులేనని తెలంగాణ హజ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మృతిచెందిన వారిలో 17మంది పురుషులు, 18మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం చెల్లించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. అంతేకాక.. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని సూచించింది. చనిపోయిన వారి మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది.
