No SSC Exams : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు.. అసలు విషయం ఇదేనంట..!
No SSC Exams : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు అంటూ జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ వచ్చేసింది.
Telangana Education commission clarity on ssc board exams cancellation news
No SSC Exams : నిన్నంతా ఒక వార్త తెలంగాణలో సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో త్వరలోనే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దవుతాయని దాని సారాంశం. మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యా రంగంలో ప్రవేశపెట్టబోయే సంస్కరణల గురించి వివరించారు. ఈ క్రమంలో పదో తరగతి, ఇంటర్ బోర్డులను రద్దు చేసి ఉమ్మడి బోర్డు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించారు. దీంతో పదో తరగతి బోర్డు రద్దవుతుంది.. పబ్లిక్ పరీక్షలు నిర్వహించరనే చర్చ తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణ విద్యాశాఖ కమిషన్ దీనిపై కీలక ప్రకటన చేసింది.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల రద్దు అంటూ వస్తున్న వార్తలను తెలంగాణ విద్యాశాఖ కమిషన్ ఓఎస్డీ డాక్టర్ జీనత్ ఖండించారు. తాము ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో.. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలనే ప్రతిపాదన చేయలేదని స్పష్టం చేశారు. కాకపోతే.. ఇప్పుడు విడివిడిగా ఉన్న ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేయాలని ప్రతిపాదించామని వెల్లడించారు. కేవలం 11వ తరగతి పబ్లిక్ పరీక్షలను మాత్రమే రద్దు చేయాలని ప్రభుత్వానికి తమ నివేదికలో సూచించినట్లు వెల్లడించారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఇలాంటి సమాచారం పట్ల ఆందోళన చెందవద్దన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించి చిట్ చాట్ లో మాట్లాడుతూ… విద్యావ్యవస్థలో సమూల మార్పులు అవసరం అని తేల్చి చెప్పారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా 10+2 విధానాన్ని బలోపేతం చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోంది అన్నారు. ఈ క్రమంలో విద్యా సంస్కరణలపై ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం కొనసాగుతోందని.. అయితే కమిషన్ ఇచ్చేది తుది నివేదిక కాదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణ విద్యా రంగాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు.
