Indiramma Illu: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బంపర్ ఆఫర్.. వాళ్లకు ఫ్రీగా..
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇంటి నిర్మాణం సమయంలో వారికి..

Indiramma Illu
Indiramma Illu: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద పేదలకు ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం మొదటి విడతలో 71,482 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో 21 నియోజకవర్గాల్లో వెయ్యికిపైగా ఇళ్లను మంజూరు చేయనుంది. ఇందులో అత్యధికంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో 2,528 ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందించనుంది. అయితే, తొలి విడతలో ఎక్కువగా స్థలం ఉండి ఇల్లు నిర్మాణం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది.
గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వీటిని పరిశీలించిన అధికారులు అర్హత కలిగిన వారితో కూడిన జాబితాలను సిద్ధం చేశారు. అయితే, తొలి విడతలో అర్హత పొందిన లబ్ధిదారులకు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిని ఎలా నిర్మించుకోవాలి.. నిర్మాణ సామాగ్రి సరఫరా, ఇతర సందేహాలను నివృత్తి చేసేందుకు గ్రామాల్లో ప్రీ-గ్రౌండింగ్ సమావేశాలను అధికారులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ నిబంధనల్లో భాగంగా.. ఇందిరమ్మ యాప్ సర్వే సమయంలో సొంత స్థలం చూపిన ప్రాంతంలో లబ్ధిదారుడే ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. మరోచోట కట్టుకుంటానంటే ఆ ఇంటిని అధికారులు రద్దు చేస్తారు.
Also Read: Liquor Prices Hiked : తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్.. వాటి ధరలు పెంపు..
ముగ్గు పోసిన తరువాత గ్రామ కార్యదర్శికి సమాచారం ఇస్తే.. క్షేత్ర స్థాయికి వచ్చి ఫొటోలు తీసి ఆన్ లైన్ లో నమోదు చేస్తారు. నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. ఇంటి పునాది పూర్తయిన తరువాతే తొలి విడత నగదు లక్ష రూపాయలు లబ్ధిదారుడి ఖాతాలో జమ అవుతాయి. అయితే, ఇంటి నిర్మాణం సమయంలో ఇసుకను ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా అందించేలా, సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
Also Read: RSS : చిలుకూరు బాలాజీ పూజారిపై దాడి.. ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన.. మరోసారి ఇలాంటివి..
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై, సహకరించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం సమయంలో ప్రతి ఇంటికి ఎనిమిది ట్రాక్టర్ల ఇసుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుతం ఆ ఇసుకను అధికారులు ఉచితంగా సరఫరా చేయనున్నారు. ఇందుకోసం సంబంధించిన కూపన్లను తహసీల్దార్ లేదా ఆర్డీవో ద్వారా లబ్ధిదారులు పొందాల్సి ఉంటుంది. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.5లక్షలు అందిస్తున్న విషయం తెలిసిందే. దీనికితో ఉచిత ఇసుకను కూడా సరఫరా చేయనున్న నేపథ్యంలో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.