Telangana Government:తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసులు పెరుగుతున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ గడువు పెంచాలని, 14 రోజులు గడువు పెంచాలని భావించింది. గడువు ముగిసిన తర్వాత..నెగటివ్ రావడం..అనంతరం కొద్ది రోజులకు పాజిటివ్ గా వస్తున్నాయని ప్రభుత్వం గ్రహించింది. కరోనా అనుమానితులు ఇక నుంచి 28 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని ఆదేశించింది.
అంతేగాకుండా ఇష్టానుసారం టెస్టులు నిర్వహించవద్దని సూచించింది. ప్రధానంగా ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా కేసులు ఎక్కువ అవుతున్నాయని నిర్ధారించింది. దీంతో ప్రైమరీ కాంటాక్ట్ కేసులకు పరీక్షలు చేయాలని, సెకండరీ కాంటాక్ట్ లకు టెస్టులు అవసరం లేదని తెలిపింది. వీరికి హోం క్వారంటైన్ సరిపోతుందని తెలిపింది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు అధికమౌతున్నాయి. 2020, ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం రాత్రి వరకు 928 కేసులు నమోదయ్యాయి. వీరిలో 194 మంది కోలుకున్నారు. 711 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 23 మంది చనిపోయారు. ఎక్కువగా GHMC పరిధిలో ఎక్కువగా పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. సూర్యాపేట, గద్వాల జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.