Ration Card : తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై వారందరికీ రేషన్ కట్!
Ration Card : దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా జనాభాలో దాదాపు 86శాతం మంది రేషన్ కార్డు లబ్ధిదారులున్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది.
Ration Card
- తెలంగాణలో రేషన్‌కార్డు లబ్ధిదారులకు అలర్ట్
- రాష్ట్రాలకు కేంద్రం కఠిన మార్గదర్శకాలు జారీ
- ఆదాయపు పన్ను చెల్లించిన వారంతా అనర్హులే
Ration card : తెలంగాణలోని రేషన్ కార్డు లబ్దిదారులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన అనర్హులందరికీ రేషన్ కార్డు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న రేషన్ కార్డు లబ్ధిదారుల్లో కనిష్ఠంగా కోటి మందికి కోత తప్పదని తెలుస్తోంది.
దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా జనాభాలో దాదాపు 86శాతం మంది రేషన్ కార్డు లబ్ధిదారులున్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. దారిద్ర్యరేఖకు దిగువనున్న పేద కుటుంబాలకు మాత్రమే రేషన్ సరుకులు అందజేయాలన్న జాతీయ ఆహార భద్రతా చట్టం నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని నిర్దేశించింది. అనర్హులను వెంటనే గుర్తించి తొలగించాలని తాజా మార్గదర్శకాల్లో కేంద్ర వినియోగదారుల సంక్షేమం, ఆహార, ప్రజా పంపిణీ వ్యవవహారాల శాఖ స్పష్టం చేసింది.
తెలంగాణలో రేషన్ కార్డులు (ఫుడ్ సెక్యూరిటీ కార్డులు) సంఖ్య దాదాపు 1,05,42,188కు చేరుకుంది. ఈ కార్డుల ద్వారా 3.35 కోట్లు నుంచి 3.36 కోట్ల మంది లబ్ధిదారులు రేషన్ ప్రయోజనం పొందుతున్నారు. గత ఏడాది కాలంలోనే ప్రభుత్వం 14.40 లక్షలకుపైగా కొత్త రేషన్ కార్డులను జారీ చేసినట్లు సివిల్ సప్లయ్ శాఖ అధికారులు వెల్లడించారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం అనర్హులు, అక్రమ కార్డులను గుర్తించి రద్దు చేస్తూ, నిజమైన అర్హులకు మాత్రమే రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకుంటుంది.
కేంద్ర, రాష్ఠ్ర ప్రభుత్వాలు ఇటీవల రేషన్ కార్డుల అనర్హులను ఏరివేస్తున్నాయి. అర్హత లేకపోయినా వివిధ మార్గాల్లో రేషన్ కార్డులు పొందిన వారిని గుర్తిస్తూ.. వెరిఫికేషన్‌లో అనర్హులుగా తేలినవారి రేషన్ కార్డులను అధికారులు రద్దు చేస్తున్నారు. ఇటీవల విచారణలో లక్ష మందికిపైగా అనర్హులను గుర్తించి రేషన్ కార్డు రద్దు చేశారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 2లక్షల మంది ఐటీ చెల్లింపుదారులు రేషన్ కార్డులను కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టీజీ విజిలెన్స్ విభాగం రహస్య ఆడిట్లో ఈ విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. దీంతో వీరి రేషన్ కార్డులను రద్దు చేయడంతోపాటు.. ఇప్పటి వరకు పొందిన సబ్సిడీలను రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి తాజా వెరిఫికేషన్ కారణంగా దాదాపు కోటి మంది లబ్ధిదారులకు రేషన్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
