Telangana Govt: రాఖీ పౌర్ణమి వేళ మహిళలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..

రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

Telangana Govt: రాఖీ పౌర్ణమి వేళ మహిళలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..

Updated On : August 9, 2025 / 10:28 AM IST

Telangana Govt: రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందుకోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా రేవంత్ సర్కార్ మహిళలకు గుడ్‌న్యూస్ చెప్పింది.

Also Read: తెలంగాణలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు

తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా నాలుగెకరాల ప్రభుత్వ భూమిని ఆయా సంఘాల పేర్ల మీద కేటాయించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో గుర్తించి కేటాయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మహిళా సాధికారతకు, మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు మరింత తోడ్పాటు అందించనుంది. వారు ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును అమ్ముకోవడం ద్వారా సంఘాలకు ఆదాయం లభించనుంది.

తొలుత సోలార్ పవర్ ప్లాంట్లు చేపట్టే సంఘాలకు నాలుగు ఎకరాల భూమి లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. కానీ, తాజాగా ప్రభుత్వ భూమినే వారి పేరు మీద ఇచ్చేలా నిర్ణయించింది. ఈ కార్యక్రమం కింద మొత్తం వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది.

ఒక్కో మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ.3కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఈ మొత్తంలో 90శాతం బ్యాంకుల ద్వారా రుణాలుగా అందిస్తారు. మిగిలిన 10శాతం మహిళా సంఘాలు భరించాల్సి ఉంటుంది.