3,726 శాంపిల్స్ లో 2,672 మందికి కరోనా పాజిటివ్…ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్స్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

  • Publish Date - July 4, 2020 / 01:19 AM IST

హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్స్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రైవేట్ ల్యాబ్ చేసిన పరీక్షలో అత్యధికంగా కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 3,726 శాంపిల్స్ లో 2,672 మందికి కరోనా పాజిటివ్ ఇచ్చింది. 71.7 శాతం కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చింది.

ఈ ల్యాబ్ ఇచ్చిన ఫలితాలను మరోసారి తెలంగాణ ప్రభుత్వం పరిశీలించనుంది. వెంటనే ల్యాబ్ ను పరిశీలించాలని ఎక్స్ పర్ట్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. రిపోర్టులను ఎక్స్ పర్ట్ కమిటీ పరిశీలించే వరకు ఆ ల్యాబ్ ఇచ్చిన ఫలితాలను తాత్కాలికంగా పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనేవుంది. రాష్ట్రంలో కరోనా కేసులు 20 వేల దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 1,892 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయ. ఒక్క జీహెచ్ ఎంసీలోనే 1,658 కేసులు నమోదు కావడం గమనార్హం. శుక్రవారం (జులై 3, 2020) కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు.

తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని మరో 1,126 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 20,462కు చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 283కు చేరుకున్నాయి. రాష్ట్రంలో 9,984 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 10, 195 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మరోవైపు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కరోనా బారిన పడ్డారు. జలుబు, దగ్గు రావడంతో ఆమె యశోద ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆమెకు పాజిటివ్ అని తేలింది. దీంతో సునీత అక్కడే చికిత్స తీసుకుంటున్నారు.

ఆలేరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె కోరారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని..చికిత్స కొనసాగుతుందన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దయ, ఆలేరు ప్రజల అభిమానంతో కరోనా నుంచి కోలుకుని త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని ఆమె తెలిపారు.