TG Hate Speech Bill : ఇకపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు వాగారో 10 ఏళ్లు జైలు రూ.లక్ష జరిమానా..!
Hate Speech Bill : రెచ్చగొట్టే వ్యాఖ్యలు, విద్వేష పూరిత ప్రసంగాలను అడ్డుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం హేట్ స్పీచ్ బిల్ తీసుకువచ్చింది.
Telangana Govt hate speech bill send to select committe it proposes up to 10 year jail term
TG Hate Speech Bill : సోషల్ మీడియా వినియోగం వచ్చాక సమాజంలో విద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు అధికం అవుతున్నాయి. ముఖం చూపించకుండా నచ్చినట్లు కామెంట్ చేసే అవకాశం ఉండటంతో.. కొందరు రెచ్చిపోయి మరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా స్త్రీలు, కులం, మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొట్టేలా, అవమానించే రీతిలో కామెంట్స్ చేస్తూ శునకానందం పొందుతుంటారు. అయితే ఇకపై అలాంటి వారి ఆటలు సాగవు. ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగాలు, వ్యాఖ్యలకు చెక్ పెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయడం కోసం హేట్ స్పీచ్ బిల్లును ప్రవేశపెట్టింది.
ఇకపై విద్వేషపూరిత ప్రసంగాలు, పోస్టులు, రచనలు చేసే వారికి భారీ మొత్తంలో జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. అలాగే ఈ నేరాలను నాన్-బెయిలబుల్ నేరాలుగా పరిగణించడం ఈ బిల్లు ముఖ్య లక్ష్యం. తరచుగా ఇలాగే విద్వేషపూరిత చర్యలకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమానా విధించేందుకు అవకాశం ఉంది. అయితే దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ బిల్లును స్పీకర్.. సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు.
అసలేంటి ఈ బిల్లు..
గత సోమవారం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన ఈ బిల్లును ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు “తెలంగాణ ద్వేషపూరిత ప్రసంగాలు మరియు ద్వేషపూరిత నేరాల (నివారణ) బిల్లు 2026″ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లుపై బీజేపీ, ఏఐఎంఐఎం, సీపీఐ పార్టీలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. అసెంబ్లీ ఏకగ్రీవ నిర్ణయం మేరకు సోమవారం (మార్చి 30) దీనిని సెలెక్ట్ కమిటీకి పంపారు.
ఈ చట్టం కిందకు వచ్చేవి..
దీని ప్రకారం ఇకపై స్త్రీ, పురుష, లైంగిక, జన్మస్థలం, కులం, మతం, జాతి, వర్గం, నివాసం, తెగలు, భాష, అశక్తత వంటి వాటికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు, ప్రసంగాలు చేయడం నిషేధించడానికి గాను తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. అలాగే మాటల ముద్రణ, ప్రచురణ, ఎలక్ట్రానిక్ మీడియం/సాధనాల ద్వారా సమాచార మార్పిడి జరిగినా కూడా ఈ హేట్ స్పీచ్ చట్టం పరిధిలోకి వస్తాయి.
ఈ బిల్లు ద్వారా అభ్యంతరకర సమాచారం, సందేశం వంటివి ఉంటే వాటిని తొలగించాలని.. ఎలక్ట్రానిక్ మీడియాతో పాటుగా.. సర్వీస్ ప్రొవైడర్లను హెచ్చరించేందుకు అధికారులకు అధికారం ఉంటుంది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే ఇకపై మీడియా, సోషల్ మీడియాలోనే కాక రచనల్లో సైతం ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసినా.. రెచ్చగొట్టేలా పోస్టులు చేసినా జైలు శిక్షతో పాటు జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు.
కర్ణాటకలో ఎలా ఉందంటే..
కర్ణాటకలో సైతం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే అక్కడ ద్వేషపూరిత ప్రసంగాల బిల్లులో ద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాలకు అక్కడి ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనాలపై విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ బిల్లుకు.. కర్ణాటక బిల్లుతో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ.. నివారణ చర్యలకు సంబంధించిన నిబంధనలలో తెలంగాణ బిల్లులో పలు ముఖ్యమైన తేడాలున్నాయి.
నివారణ చర్యల పరిమితి
తెలంగాణ ముసాయిదా చట్టం ప్రకారం, పోలీసులు ముందస్తు చర్యలు (Preventive Action) తీసుకోవాలంటే సదరు వ్యక్తి గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన రికార్డు (Repeat Offender) ఉండాలి. ఇది భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలగకుండా చూసేందుకు పెట్టిన ‘సేఫ్ గార్డ్’ గా కనిపిస్తోంది.
కర్ణాటక బిల్లుతో పోలిక: కర్ణాటక చట్టంలో ఎవరినైనా అనుమానం ఉంటే ముందస్తుగా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కానీ తెలంగాణ బిల్లు కేవలం “పాత నేరస్తుల”పైనే దృష్టి సారించింది.
బిల్లుపై ప్రతిపక్షాలేమంటున్నాయి
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ బిల్లును.. విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ, AIMIM, సీపీఐ పార్టీలు వ్యతిరేకించడమే కాక.. ఏకగ్రీవంగా దీనిని సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరాయి. అందుకు కారణాలు.. ఈ బిల్లులో ద్వేషపూరిత ప్రసంగం (Hate Speech) అనే పదానికి స్పష్టమైన నిర్వచనం లేదు. కనుక.. ప్రభుత్వం తనపై విమర్శలు చేసే రాజకీయ ప్రత్యర్థులపై దీనిని ప్రయోగించే ప్రమాదం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పోలీసులకు అపరిమిత అధికారం:
ఈ బిల్లు ద్వారా ముందస్తు నివారణ చర్యల పేరుతో.. పోలీసులకు మితిమీరిన అధికారాలు ఇవ్వడానికి అవకాశం లభిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ఇది పౌర హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని.. అధికార పార్టీ సూచన మేరకు పోలీసులు ప్రభుత్వంపై విమర్శలు చేసే వారిపై చర్యలు తీసుకుంటారని.. ఇది వాక్ స్వాతంత్య్రాన్ని కాలరాయడమే అవుతుందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ బిల్లులో ఏది విమర్శ? ఏది ద్వేషం? అనే దానిపై చట్టంలో మరింత స్పష్టత కావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
విశ్లేషకుల అభిప్రాయం..
ఈ బిల్లుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ప్రభుత్వం.. శాంతిభద్రతల పేరు చెప్పి.. సోషల్ మీడియాపై నియంత్రణ చేసేలా బిల్లు తీసుకొస్తుందంటున్నారు. ఈ బిల్లులోని శిక్షలకు ముందస్తు బెయిల్ ఉండదని.. ఇది పక్కా పథకం ప్రకారం రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ వ్యతిరేక విమర్శలు చేసేవారిని కఠినంగా నియంత్రించేందుకు తీసుకువస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లులో అతి కీలకమైన అంశం.. ఏదైనా వాట్సాప్ గ్రూపులో అడ్మిన్ వేసే పోస్టుకు.. సదరు గ్రూపులో ఉన్న సభ్యులందరి మీద చర్యలు తీసుకునేందుకు ఈ బిల్లు అవకాశం ఉందని.. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదంటున్నారు.
