Cm Revanth: కిషన్ రెడ్డి, బండి సంజయ్ జాగ్రత్త.. మీ ఉద్యోగాలు పోతాయి- డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
పార్లమెంటు స్థానాల పెంపు ఉత్తర, దక్షిణ భారత్ లో సమానంగా ఉండాలన్నారు.
Cm Revanth: నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణ భారతం అప్రమత్తం కావాలని అన్నారు. పార్లమెంటు స్థానాల పెంపు ఉత్తర, దక్షిణ భారత్ లో సమానంగా ఉండాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఉత్తర భారత్ లో ఉన్న పార్లమెంటు స్థానాలకు అదనంగా 50శాతం సీట్లు పెంపు ఉండాలన్నారు. పార్లమెంట్ స్థానాలను జనాభా ప్రాతిపదికన పెంచితే దక్షిణ భారత్ కు నష్టమే అని హెచ్చరించారు.
పార్లమెంటు నియోజకవర్గాల పెంపు విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉద్యోగాలు పోతాయని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సూచనతోనే స్టాలిన్ నేతృత్వంలో జరిగిన భేటీ హాజరయ్యామని తెలిపారు. మరోవైపు కేసీఆర్ వల్లే తనకు పేరు ప్రఖ్యాతలు, గుర్తింపు వచ్చాయని రేవంత్ అన్నారు. మహా భారతంలో శకుని లేకపోతే కృష్ణుడు లేడు, కేసీఆర్ లేకపోతే తాను లేను అని వ్యాఖ్యానించారు.
డీలిమిటేషన్ కు సంబంధించి 50శాతం సీట్లు పెంచితే న్యాయమే అని బీజేపీ నేతలు అంటున్నారు, అయితే ఇది పూర్తిగా అవగాహన లేకపోవడమే అని సీఎం రేవంత్ అన్నారు. 50శాతానికి పైగా సీట్లు పెంచితే దక్షిణ భారతం రాజకీయంగా పూర్తిగా నష్టపోతుందని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక నియంతృత్వానికి దారితీసే ప్రమాదం పొంచి ఉందన్నారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ అంశంలో బీజేపీ చాలా తప్పుడు దారిలో వెళ్తోందని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నాయకులు ముఖ్యంగా లక్ష్మణ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వారు.. 50శాతం సీట్ల పెంపుతో దక్షిణాదికి వచ్చే నష్టం ఏమీ లేదంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రేవంత్ రెడ్డి.
బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 50శాతం పైగా సీట్ల పెంచితే భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 120 ఎంపీ స్థానాలు పెరుగుతాయని.. ఇది రాజకీయంగా, ఆర్థికంగా ఉత్తరాది, దక్షిణాది మధ్య అంతరం ఏర్పడేందుకు దారితీస్తుందని, ఒక సంక్షోభానికి, నియంతృత్వానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనిపై అవసరమైతే ఐక్య కార్యాచరణ పోరాటం చేసి కేంద్రం కళ్లు తెరిపిస్తామన్నారు.
Also Read: నకిలీ కాదు ఒరిజినలే.. నా ఒంటి మీదున్న బంగారం నకిలీ అని దుష్ప్రచారం చేస్తున్నారు- 10టీవీతో సూర్యాభాయ్
