వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు మరింత దగ్గర అవుతాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ రాబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.

Minister Komatireddy Venkat Reddy: తెలంగాణ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ రాబోతోందని ఆర్అండ్‌బీ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో వార్డుకో వాలంటీర్ వ్యవస్థ వ్యవస్థ రాబోతుందని. దీని ద్వారా ప్రజలకు మరింత దగ్గర అవుతావుతామని ఆయన చెప్పారు. నల్గొండ పట్టణంలోని ఎమ్ఎన్ఆర్ గార్డెన్ లో బుధవారం జరిగిన నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీనియర్ నేత జానారెడ్డి, నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేయకపోతే దేనికైనా సిద్దమేనని ప్రకటించారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతున్నారని జోస్యం చెప్పారు.
అగ్గిపెట్టె రావు మళ్లీ వస్తున్నారు
పదేళ్లలో లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో జనం ఓడించారని.. అగ్గిపెట్టె రావు మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని అన్నారు. 26 వేల కోట్ల రూపాయల కాళేశ్వరం లోన్ అభాసుపాలయ్యిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్, కేటీఆర్ మానసిక పరిస్థితి దిగజారి పోయిందని.. బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసిలో వేసినట్టేనని పేర్కొన్నారు. నీటి కరువుకు కారణం బీఆర్ఎస్ పార్టీయేనని.. 2004లోనే 33 కిలోమీటర్ల ఎస్ఎల్‌బీసీ పూర్తి చేస్తే కేసీఆర్ ఆ ప్రాజెక్టు పక్కన పెట్టారని ఆరోపించారు. మూడేళ్లలో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీయిచ్చారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని ఆరులేన్లుగా 3 నెలల్లో మొదలు పెట్టనున్నామని వెల్లడించారు. 4 నెలల్లోనే వెయ్యి కోట్లు నిధులు తెచ్చానని.. రూ.700 కోట్లతో నల్గొండ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగబోతుందన్నారు.
జానారెడ్డి అదృష్ట వంతుడని.. ఒక కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు, మరో కొడుకు భారీ మెజార్టీతో ఎంపీగా గెలువబోతున్నారని మంత్రి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. గుత్తా అమిత్ రెడ్డికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని, పార్టీలో నాయకులందరికీ సముచిత గౌరవం ఉంటుందని భరోసాయిచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనారోగ్య కారణాలతో మీటింగ్‌కు హాజరు కాలేకపోయారని చెప్పారు. ”సీఎం వద్ద ఏ పని కావాలన్నా నేను చేసుకొస్తా.. భారీ మెజార్టీ మీరు ఇవ్వండి” అంటూ నల్లగొండ ప్రజలను కోరారు.
Also Read: నన్ను బెదిరించి జైల్లో పెట్టాలని చూస్తున్నారు- సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కోమటిరెడ్డి అంటేనే కార్యకర్తలు
కాంగ్రెస్ కార్యకర్తల కోసం తన ప్రాణాలైన ఇస్తానని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ”గల్లీ నుంచి నన్ను ఢిల్లీ వరకు పంపిన మీకు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే. కార్యకర్తలు అంటేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కోమటిరెడ్డి అంటేనే కార్యకర్తలు. నాకు కొడుకు లేడు.. మీరే నా వారసులు. పేద పిల్లల చదువు బాధ్యత ప్రతీక్ పౌండేషన్ తీసుకుంటుంద”ని అన్నారు.