Multiplex Theatres: తెలంగాణలో మల్టీప్లెక్స్ థియేటర్లకు ఊరట.. హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ..

తెలంగాణలో మల్టీప్లెక్స్ థియేటర్లకు ఊరట లభించింది. ఈ మేరకు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Multiplex Theatres: తెలంగాణలో మల్టీప్లెక్స్ థియేటర్లకు ఊరట.. హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ..

Multiplex Theatres

Updated On : March 1, 2025 / 2:08 PM IST

Telangana High Court: తెలంగాణలో మల్టీప్లెక్స్ థియేటర్లకు ఊరట లభించింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉతర్వులను సరిచేస్తూ తాజాగా హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై ఇటీవల దాఖలైన పటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని ఆదేశించింది. ఈ విషయంపై అన్నివర్గాలతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. జనవరి 21న హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది. అయితే, తాజాగా ఆ తీర్పును సవరిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

 

గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశాయి. పిల్లల ప్రవేశంపై ఆంక్షల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు హైకోర్టు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని పిటిషన్ లో మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం కోరింది. తాజాగా.. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం తీవ్రంగా నష్టపోతుందన్న పిటీషనర్ల వాదనను పరిగణలోకి తీసుకుంది. దీంతో.. పదహారేళ్లలోపు పిల్లలను రాత్రి 11 గంటల తరువాత ఉదయం 11గంటల లోపు థియేటర్లలోకి అనుమతించొద్దన్న తీర్పును సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన హైకోర్టు.. 16ఏళ్ల లోపు పిల్లలు అన్ని షోలకు అనుమతించాలని సవరించిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. కేసు తదుపరి విచారణ మార్చి 17వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.