ఏపీలో కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ తెలంగాణలో చెల్లుబాటుపై హైకోర్టు సంచలన ఆదేశాలు..

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం తెలంగాణలో పీజీ మెడికల్ అడ్మిషన్లకు చెల్లుబాటు అవుతుందా..? అనే అంశంపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

ఏపీలో కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ తెలంగాణలో చెల్లుబాటుపై హైకోర్టు సంచలన ఆదేశాలు..

High Court

Updated On : February 11, 2025 / 3:11 PM IST

High Court: ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం తెలంగాణలో పీజీ మెడికల్ అడ్మిషన్లకు చెల్లుబాటు అవుతుందా..? అనే అంశంపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తెలంగాణ అధికారులు తాజాగా జారీ చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన వారికే పీజీ మెడికల్ అడ్మిషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తామన్న నిబంధనను సవాలు చేస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన నిహారిక తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. ఏపీలో పొందిన సర్టిఫికెట్ ద్వారా ఇక్కడ రిజర్వేషన్లు కల్పించాలని అనుమతి మంజూరు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిందేనని, ఈ అభ్యర్థులకే రిజర్వేషన్లు వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది.

Also Read: బాత్రూంలో రీల్స్ లేదా షార్ట్స్ చూస్తున్నారా..? అయితే ఈ భయంకర నిజాలు మీ కోసమే..?

రాష్ట్రానికి చెందిన నిర్దేశిత అధికారి జారీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించిన అభ్యర్థులకే పీజీ మెడికల్ అడ్మిషన్లలో రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం చర్యను హైకోర్టు సమర్ధించింది. కాలేజీ వర్సిటీ, ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డి తమ వాదనలు వినిపిస్తూ.. ఏపీకి చెందిన ఎస్సీ వర్గాలు తెలంగాణలో రిజర్వేషన్లు కోరడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ కుల ధ్రువీకరణ పత్రాన్ని తెలంగాణలో అమలు చేయాలని కోరడం చట్ట వ్యతిరేకమని తెలిపారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది బి. మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఎస్సీ ధ్రువీకరణ పత్రాన్ని రిజర్వేషన్లు కేటాయింపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించకపోవడం వల్ల ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా పిటిషనర్లను స్థానికులుగా పరిగణిస్తున్నప్పటికీ ఎస్సీ రిజర్వేషన్ కేటగిరీ కింద కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం ఆమోదించడం లేదని అన్నారు.

Also Read: Bird Flu: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ హడల్.. చికెన్, గుడ్లు తింటున్నారా.. అయితే, తప్పనిసరిగా ఇలా చేయండి

ఇరుపక్షాల వాదనల తరువాత రాష్ట్ర ప్రభుత్వం, వర్సిటీల వాదనలను హైకోర్టు ఆమోదిస్తూ తీర్పు వెలువరించింది. దీనికితోడు ఏపీ ధ్రువపత్రాలు ఉన్న వారిని కౌన్సెలింగ్ కు అనుమతించాలని, ఫలితాలు వెల్లడించరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.