Telangana Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగిస్తారా?

తెలంగాణ లో లాక్ డౌన్‌ని పొడిగించనున్నారా? కోవిడ్‌ కట్టడికి ప్రభుత్వం ముందున్న మార్గాలు ఏంటీ? ఇప్పుడిదే హాట్‌టాపిక్‌. ఇవాళ(30 మే 2021) జరగనున్న కేబినెట్‌ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.

Telangana Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగిస్తారా?

Telangana Lockdown Cm To Announce Decision On Restrictions Today

Updated On : May 30, 2021 / 10:24 AM IST

Decision on Restrictions: తెలంగాణ లో లాక్ డౌన్‌ని పొడిగించనున్నారా? కోవిడ్‌ కట్టడికి ప్రభుత్వం ముందున్న మార్గాలు ఏంటీ? ఇప్పుడిదే హాట్‌టాపిక్‌. ఇవాళ(30 మే 2021) జరగనున్న కేబినెట్‌ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టగా.. లాక్‌డౌన్‌ ఎత్తేసి కర్ఫ్యూ విధిస్తారా..? లేకపోతే సడలింపులు ఇస్తారా? అనేది తేలిపోనుంది.

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగించాలా? వద్దా? ఇదే అంశంపై సర్కార్ తర్జనభర్జన పడుతోంది. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో మంత్రివర్గం సమావేశం కానుంది. కోవిడ్ కట్టడి, లాక్‌డౌన్‌పైనే ప్రధానంగా చర్చ జరగనుంది. దీంతో పాటు వ్యవసాయం, ధాన్యం సేకరణ, విత్తనాలు-ఎరువుల లభ్యత, రాష్ట్రావతరణ వేడుకల నిర్వహణపైనా మంత్రివర్గం చర్చించనుంది.

లాక్‌డౌన్‌ అమలుతోనే కోవిడ్ కంట్రోల్ అవుతోందని ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్ సెకండ్‌ విజృంభించిన మొదట్లో తెలంగాణలో రోజువారీ కేసులు 10 వేల మార్కును దాటాయి. ఇప్పుడు 90 వేల టెస్ట్‌లు చేస్తున్నా మూడు వేల లోపు కేసులు మాత్రమే వస్తున్నాయి. మరింత కంట్రోల్ చేసేందుకు ఇంకో వారం పాటు లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లాక్‌డౌన్‌ అమలుపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కూలీలు, చిరు వ్యాపారులు ఇక్కట్లు, 4 గంటల సడలింపుతో జనం రద్దీ వీటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే.. ఎలాంటి నిర్ణయం వస్తుందనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

కరోనా కట్టడిలో భాగంగా ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే ఒకసారి పొడిగించిన గడువు నేటితో ముగియనుంది. దీంతో మరోసారి పెంపుపై కేబినెట్‌లో విస్తృతంగా చర్చించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి లాక్‌డౌన్‌ మొదలైన 12వ తేదీకి రోజువారీ కరోనా కేసులు 8 వేలు ఉంటే, మరణాల సంఖ్య 55కు పైగా ఉంది. పది రోజులుగా 4 వేల లోపు కేసులు మాత్రమే వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడయితే 3 వేల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య గణనీయంగా ఉంది. 20 లోపు నమోదవుతున్నాయి. నిన్న విడుదలైన లెక్కప్రకారం 21 మంది మృతిచెందారు.

లాక్‌డౌన్ కొనసాగిస్తే… రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడే భారం గురించి కేబినెట్‌లో చర్చించనున్నారు. ఏదేమైనా మరికొన్ని సడలింపులు ఇచ్చి.. లాక్‌డౌన్ కొనసాగించాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రైతులకు ఇబ్బందులు కలుగకుండా వ్యవసాయ శాఖను లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశముంది. వ్యవసాయం, పంటలు, ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, నాసిరకం విత్తనాల నిరోధంపై కేబినెట్‌లో ప్రత్యేకంగా చర్చించనున్నారు.

కోవిడ్‌, బ్లాక్ ఫంగస్‌ రోగుల చికిత్సకు వైద్య సిబ్బంది నియామకం, ఆసుపత్రుల్లో వసతుల కల్పన, ఖరీదైన మందుల వాడకంతో ప్రభుత్వానికి ఖర్చు పెరిగింది. కొన్ని శాఖలకు కేటాయించిన నిధులు వ్యయం కాకపోవడంతో వాటిని వైద్యం, హోం శాఖలకు మళ్లింపుపై ఈ కేబినెట్‌ భేటీలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.