ఉత్కంఠ.. ఒకట్రెండు రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు? ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవా? ఎందుకంటే?
ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా తమ వ్యూహం తమకు ఉందని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయట.

Supreme Court
తెలంగాణలో ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి అంటుంటే..కాదు కాదు ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయని గులాబీ బాస్ కేసీఆర్ ధీమాతో ఉన్నారు. రు. దీంతో పార్టీ మారిన ఆ పది మంది ఎమ్మెల్యేల విషయంలో ఏం జరగబోతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఒకట్రెండు రోజుల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించే అవకాశం ఉండటంతో తెలంగాణ రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆ పది మంది ఎమ్మెల్యేలు సైతం తమ రాజకీయ భవిష్యత్ ఏంకాబోతోందన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారట.
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేల అంశం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కారు గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే ఆ పది మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పలు మార్లు స్పీకర్ ను కోరినా స్పందించక పోవడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై పలు మార్లు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం..ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం తీసుకుంటారని అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ తో పాటు ఆ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపింది.
Also Read: జియోకు పోటీ… గూగుల్‌తో కలిసిన ఎయిర్‌టెల్… కస్టమర్లకు ఉచితంగా 100 జీబీ స్టోరేజ్… ఇలా పొందండి…
సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులకు స్పీకర్ కార్యాలయం సహా ఆ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే వివరణ ఇచ్చారు. మెజార్టీ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని అఫిడవిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసుపై తుది విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసు విచారణ సమయంలో జడ్జ్ గా ఉన్న జస్టిస్ బీఆర్ గవాయ్ ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు.
రాజకీయ భవిష్యత్ ఏంటన్న దిగులు
ఈ క్రమంలో ఒకటి రెండు రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడనుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతోందన్న ఉత్కంఠ పార్టీ మారిన ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో నెలకొంది. అయితే కచ్చితంగా తమపై వేటు పడుతుందన్న అనుమానం గులాబీ గూటి నుంచి హస్తంపార్టీలోకి వలసొచ్చిన ఆ 10 మంది ఎమ్మెల్యేలను తెగ వెంటాడుతోందట. ఒకవేళ పార్టీ ఫిరాయింపు వేటు పడితే తమ రాజకీయ భవిష్యత్ ఏంటన్న దిగులు వారిలో ఆందోళన కలిగిస్తోందట.
పార్టీ ఫిరాయంపులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ఎవరికి వారు తమ వాదనను వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఏకంగా అసెంబ్లీ వేదికగానే సీఎం ప్రకటించారు. అయితే ఉప ఎన్నికలు రావని కామెంట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.
ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా ఆ పది నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ రావచ్చని, అందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పలుమార్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పష్టం చేశారు. దీంతో ఒకటి రెండు రోజుల్లో పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వబోతున్న నేపథ్యంలో ఆ పది మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఏంకాబోతోంది? తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా? రావా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా తమ వ్యూహం తమకు ఉందని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయట. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే…ఆ 10 నియోజకవర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో గెలిసి తమ తమ స్థానాలను కాపాడుకుంటారని హస్తంపార్టీ ఫుల్ పాజిటీవ్ గా ఉందట.
అయితే ఆ 10 నియోజకవర్గాల్లో ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే..పదికి పదిని తిరిగి దక్కించుకునేందుకు గులాబీ పార్టీ ఇప్పటికే ఓ స్కెచ్ ను రెడీ చేసి పెట్టుకుందని గులాబీ పార్టీ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది. చేజారిన 10 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దించి వాటిని తిరిగి దక్కించుకుంటామని గులాబీ బాస్ కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే గెలిచే సత్తా ఉన్న కొంతమంది నేతలను కూడా రెడీ చేసినట్లు చర్చ విన్పిస్తోంది. అయితే సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో..ఆ తర్వాత జరిగే పరిణామాలేంటో అన్నది మరో రెండు, మూడు రోజుల్లో తేలిపోనుంది.