రాజ్‌భవన్ చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. తోటి మహిళా ఉద్యోగిని ఫొటోలు మార్ఫింగ్ చేసి.. జైలు నుంచి బెయిల్‌పై వచ్చాక.. అసలేం జరిగిందంటే..?
రాజ్‌భవన్ చోరీ కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు శ్రీనివాస్ మహిళా ఉద్యోగిని ఫొటోలు మార్ఫింగ్ కేసులో కొద్దిరోజుల క్రితమే జైలుకెళ్లి వచ్చాడు..

Telangana Raj Bhavan
Telangana Raj Bhavan: రాజ్‌భవన్ చోరీ కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈనెల 14వ తేదీన రాజ్ భవన్‌లోకి హెల్మెంట్ ధరించి వచ్చిన వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. నాలుగు హార్డ్ డిస్క్ లను చోరీ చేశాడు. రాజ్ భవన్ అధికారులు ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. కంప్యూటర్ హార్డ్‌వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే, గతంలోనూ ఇతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
మహిళా ఉద్యోగిని మార్ఫింగ్ ఫొటోలతో..
రాజ్ భవన్ లో పనిచేసే తోటి మహిళా ఉద్యోగిని ఫొటోలు మార్ఫింగ్ చేసి శ్రీనివాస్ భయబ్రాంతులకు గురిచేశాడు. తనకేమీ తెలియనట్లుగా ఎవరో నాకు ఈ ఫొటోలు పంపిస్తున్నాడు జాగ్రత్త అని చెప్పాడు. దీంతో కలవరానికి గురైన మహిళా ఉద్యోగిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఆ మార్ఫింగ్ ఫొటోలను శ్రీనివాసే పంపించాడని పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అరెస్టు చేసి వారం కిందట రిమాండ్ కు పంపారు. ఈ ఘటన తరువాత రాజ్ భవన్ అధికారులు శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. జైలుకెళ్లిన శ్రీనివాస్ రెండు రోజుల తరువాత బెయిల్ పై విడుదలయ్యాడు.
హార్డ్ డిస్క్ ల కోసం..
జైలు నుంచి బయటకు వచ్చిన శ్రీనివాస్ రాత్రి సమయంలో సెక్యూరిటీని మభ్యపెట్టి రాజ్ భవన్ లోపలికి వెళ్లాడు. తన కంప్యూటర్ లో ఉన్న హార్డ్ డిస్క్ ను చోరీ చేసుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటనపై రాజ్ భవన్ అధికారులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. శ్రీనివాస్ చోరీ చేసినట్లు గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్ డిస్క్‌లో మహిళకు సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు ఉండటంతో ఆ సాక్ష్యాలను డిలీట్ చేసే ప్రయత్నంలో చోరీకి పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం శ్రీనివాస్ రెండోసారి జైలుకు వెళ్లాడు.