Telangana Registrations begin : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ…తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం..పాత పద్ధతిలోనే జరుగనుంది. సెప్టెంబర్ 8 కంటే ముందు ఉన్న పాత పద్ధతిలోనే 2020, డిసెంబర్ 21వ తేదీ సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో పాత పద్ధతిలోనే నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదును చేపట్టాలని ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రిజిస్ట్రేషన్లు సజావుగా, వేగవంతంగా జరిగేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ విధానంలో కాకుండా కార్డ్ విధానంలో జరగనుంది. దీంతో ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తులకు స్లాట్ బుకింగ్ నిలిపివేశారు.
ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి నిర్ణయించిన తేదీల్లో యథాతథంగా రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. నూతన విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను డిసెంబర్ 11న ప్రారంభించారు. ఈ నూతన విధానంలో ఇప్పటివరకు 2,599 స్లాట్స్ బుక్ అవగా వీటిలో 1,760 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. హైకోర్టు ఆదేశాలతో నూతన విధానానికి తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పడింది.