Telangana Covid Report
Telangana Latest Covid Report : తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 15వేల 633 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 24 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు.
తెలంగాణలో ఇప్పటివరకు 7,91,857 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,87,508 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 238 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. కాగా, క్రితం రోజు రాష్ట్రంలో 12వేల 776 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 34 మంది పాజిటివ్ గా తేలింది.
అటు దేశంలో మరోసారి కరోనా కలకలం రేగింది. తగ్గినట్టే తగ్గి మళ్లీ బుసలు కొడుతోంది. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా స్వల్ప హెచ్చు తగ్గుదలతో కొత్త కేసులు 2వేల పైనే ఉంటున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 4,49,197 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 2,483 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.55శాతంగా ఉంది. ఇదే సమయంలో మరో 1,970 మంది వైరస్ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 98.75శాతంగా ఉంది.
క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో యాక్టివ్ కేసులు మళ్లీ 16వేల కిందకు దిగొచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,636 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల రేటు 0.04శాతంగా ఉంది. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 1,399 మంది కరోనాతో మరణించారు. కేరళ సహా పలు రాష్ట్రాల్లో మరణాల సంఖ్యను సవరించడంతో మరణాలు పెరిగినట్లు సమాచారం.
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. నిన్న మరో 22.83లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటి వరకు 187 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కొన్ని రోజులుగా కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్నట్లు కన్పించడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా కర్నాటక, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలు మళ్లీ మాస్క్ నిబంధనలను అమల్లోకి తెచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఆదేశిస్తున్నాయి.
కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా ఫోర్త్ వేవ్ జూన్ తర్వాత గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని.. దాని ప్రభావం అక్టోబర్ వరకు ఉంటుందని కాన్పూర్ ఐఐటీ నిపుణులు అంచనా వేసినట్టు తెలిపారు. వ్యాక్సిన్లు వేయించుకోవడం, మాస్క్ ధరించడం వంటి ముందు జాగ్రత్తలు పాటిస్తూనే కరోనా వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవాలని సూచించారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.26.04.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/h1DOKAlHCt— IPRDepartment (@IPRTelangana) April 26, 2022