School Buses: తెలంగాణలో స్కూల్ బస్సుల స్పెషల్ డ్రైవ్.. 40 బస్సులు సీజ్.. 165 వాహనాలపై కేసులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా ప్రైవేట్ పాఠశాలల బస్సులు(School Buses) రవాణా నిబంధనలపై రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది.
Telangana transport department special drive on private school buses
- స్కూల్ బస్సులపై రవాణా శాఖ తనిఖీలు.
- నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కేసులు.
- ఫిట్నెస్ లేని బస్సులు సీజ్.
School Buses: తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం జూన్ 15 నుండి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు సురక్షితంగా ఇళ్లకు, స్కూళ్లకు చేరుకునేలా చూడటమే ధ్యేయంగా రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రైవేట్ పాఠశాలల బస్సులు రవాణా నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తున్నాయా లేదా అనే కోణంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జూన్ 16న ఒక్కరోజే దాదాపు 1200కు పైగా పాఠశాల వాహనాలను (School Buses)అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న 165 వాహనాలపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేసి ఉక్కుపాదం మోపారు.
ముఖ్యంగా ఎలాంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా ప్రమాదకరంగా రోడ్డెక్కిన 40 స్కూల్ బస్సులను అధికారులు అక్కడికక్కడే సీజ్ చేశారు. స్కూల్ బస్సుల తనిఖీల సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రాబోయే రోజుల్లో కూడా ఈ రకమైన తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని రవాణా శాఖ స్పష్టం చేసింది.
