TS SSC leak Case: ఫోనుతో విచారణకు హాజరైన ఈటల.. ఈ ప్రశ్నలు అడిగారని వెల్లడి

పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రం వాట్సాప్ లో వైరల్ వ్యవహారంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఈటల వివరణ ఇచ్చారు. బీజేపీ లీగల్ బృందంతో కలిసి ఈటల కమిషనరేట్ లోకి వెళ్లారు.

TS SSC leak Case: ఫోనుతో విచారణకు హాజరైన ఈటల.. ఈ ప్రశ్నలు అడిగారని వెల్లడి

BJP MLA Etela Rajender

Updated On : April 10, 2023 / 4:14 PM IST

TS SSC leak Case: తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో వరంగల్ కమిషనర్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తన సెల్ ఫోనును కూడా తీసుకొచ్చారు. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్పానని ఆయన తెలిపారు.

ప్రశాంత్ ఫోన్ చేశాడా? అని అడిగారని, అతడితో పరిచయం ఉందా? అని అడిగారని అన్నారు. తాను లేదు అని సమాధానం చెప్పానని వివరించారు. ఈ నెల 7వ తేదీన ఈటల రాజేందర్ కు పోలీసులు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రం వాట్సాప్ లో వైరల్ వ్యవహారంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఈటల వివరణ ఇచ్చారు.

బీజేపీ లీగల్ బృందంతో కలిసి ఈటల కమిషనరేట్ లోకి వెళ్లారు. విచారణ తర్వాత ఈటల మీడియాతో మాట్లాడుతూ… డీసీపీ బృందం ముందు తన సెల్ ఫోన్ తో హాజరయ్యానని తెలిపారు. తనకు ప్రశాంత్ నుంచి ఎలాంటి మెసేజులు, ఫోన్లు రాలేదని చెప్పారు. తనకు తన నియోజకవర్గం నుంచి ఓ కార్యకర్త మెసేజ్ పంపాడని, కానీ, తాను ఆ మెసేజ్ ను ఒపెన్ కూడా చేయలేదని ఈటల అన్నారు.

తాను బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధినని చెప్పారు. తమ పార్టీ పిల్లల బావిష్యత్ కోరే పార్టీ అని చెప్పుకొచ్చారు. అసలు లీకేజీ అనేదే అబద్ధమని, లీకేజీకి ఆస్కారమే లేదని తెలిపారు. కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని కుట్రలు చేశారని ఆరోపించారు.

కుట్రపూరితంగా కేసులు పెట్టించారని చెప్పారు. 30 లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారని తెలిపారు. ప్రజలు దృష్టి మరల్చడం కోసమే ఈ కేసులు పెడుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులతో అల్లాడుతుంటే పట్టించుకోని సీఎం తన ఖజానా నింపుకుంటున్నారని విమర్శించారు.

దేశంలోనే రిచెస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. 8 ఏళ్ల కాలంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇచ్చిన 50 ఏళ్ల నాటి అసైన్డ్ భూములు కూడా లాక్కున్న చరిత్ర కేసీఆర్ దని అన్నారు. కేసీఆర్ కుట్రలు, కేసులకు తాము బయపడే ప్రసక్తే లేదని చెప్పారు. విచారణ ముగిసిన అనంతరం ఈటల హైదరాబాద్ కు బయలుదేరారు.

TS SSC leak Case: తన ఫోను పోయిందని పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు